మందు పుచ్చుకోని వారి కంటే కూడా మందు పుచ్చుకునే వారినే దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయట. మామూలుగా ఆడ దోమలే రక్తం పీల్చేందుకు మనుషులని కుడతాయి. ఆడ దోమలే మనుషులని కుట్టడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని అంతకు ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు ఆడ దోమలు మద్యం సేవించే వారినే ఎందుకు కుడతాయో తెలుసుకుందాం. మందు తాగే వారిని చూస్తే దోమలు విపరీతంగా ఆకర్షితులవుతాయి. సాధారణంగా ఆడవాళ్ళకి మందు తాగే మగాళ్ళంటే ఇష్టం ఉండదు కదా. మరి ఈ ఆడ దోమలేంటి మద్యం తాగినోళ్ల రక్తం తాగుతున్నాయి? బహుశా ఈ ఆడ దోమలకి మద్యం అలవాటు ఉందేమో! మద్యం ఎక్కువగా సేవిస్తే దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
మద్యం తాగిన వ్యక్తులు ఎక్కువగా దోమల కాటుకి గురవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. 2002లో జరిపిన పరిశోధనల్లో.. బీర్ తాగే వారిని దోమలు ఎక్కువగా కుడతాయని తేలింది. దీనికి కారణం బీర్ లో ఇథనాల్ గాఢత 5.5 శాతం ఉండడమే. ఆయా బ్రాండ్లను బట్టి వాటిలో ఇథనాల్ గాఢత ఉంటుంది. దీని వల్ల దోమలు 3, 4 రెట్లు ఎక్కువ కుట్టేందుకు ఆకర్షితులవుతాయి. ఆ ఇథనాల్ స్మెల్ కి అవి మందుబాబులని కుట్టడానికి వస్తాయి. 2011లో జరిపిన పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. మందు బాబులని చూస్తే దోమలు 15 శాతం అధికంగా వెర్రెక్కిపోతాయని. ఎవరైతే మద్యం పుచ్చుకుంటారో వారిని 15 శాతం కంటే ఎక్కువగా దోమలు కుడతాయని తేలింది. మద్యం యొక్క జీవక్రియ కారణంగా వాసనలు, ఇతర సంకేతాల్లో మార్పులు దోమల ఆకర్షణకు కారణమవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.
కానీ మద్యం తాగినోళ్ళని దోమలు ఎందుకు టార్గెట్ చేస్తాయో అన్న సరైన వివరణ అయితే ఇవ్వలేదు. కానీ మద్యం మత్తులో ఉండేవారిని మాత్రం బాగా కుడతాయని, మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఎక్కువగా దోమకాటుకి గురవుతారని పరిశోధనల్లో తేలింది. కేవలం మందు తాగే అబ్బాయిలే కాదు, మద్యం సేవించే అమ్మాయిలని సైతం దోమలు కుడతాయని తెలుసుకోవాలి. ఏమో ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్న సామెతని నిజం చేస్తూ.. దోమలు మద్యం సేవించే ఆడవాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తాయేమో ఎవరికి తెలుసు? మరి మద్యం సేవించే వారిని దోమలు కుడతాయని పరిశోధనలు చెబుతున్న తరుణంలో.. మద్యం ప్రియులు ఆడ దోమలతో కుట్టించుకుంటారా? లేక ఎందుకొచ్చిన డెంగ్యూలు, మలేరియాలు అని మద్యం మానేస్తారా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.