దోమలు కుడతాయని తెలుసు. ఇందులో మళ్ళీ ఆడ,మగ తేడా ఉంటుందా? అన్న డౌట్ రాకుండా ఉండదు. సహజంగా అన్ని దోమలూ కుడతాయని అనుకుంటారు. కానీ మనుషుల్ని కుట్టేవన్నీ ఆడ దోమలే. ఆడ దోమలకే మనుషుల రక్తం కావాలి. దోమల్లో కూడా లేడీ డామినేషన్ ఎక్కువైపోయిందండోయ్. పాపం మగ దోమలకి మనుషుల్ని కుట్టేంత బలం ఉండదంట. మనుషుల్ని కుట్టేంత బలమే ఉండదు, ఇక ఇంట్లో ఏ గొడవలైనా అయితే భార్య దోమల్ని మగ దోమలు ఎలా కొట్టగలుగుతాయి చెప్పండి. వీళ్ళ ప్రైవసీ మేటర్ సమాజానికి అనవసరం ఆఫ్ ఇండియా కాబట్టి అసలు మేటర్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఆడ దోమలు మనుషుల్ని కుట్టడానికి కారణం ఏంటి? దీని వెనుక సైన్స్ ఉందా? అదేంటో తెలుసుకుందాం పదండి.
సాధారణంగా ఆడ దోమలైనా, మగ దోమలైనా పొడవాటి ముక్కు ద్వారా పూల మీద, పండ్ల మీద ఉన్న రసాన్ని పీల్చుకుని బతుకుతాయి. పూల నుంచి పండ్ల నుంచి ఆహారం దొరుకుతున్నప్పుడు మనుషుల రక్తంతో పనేంటి అని మీరు అనుకోవచ్చు. మరేమో.. వాటికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. పెళ్లి చేసుకున్నాక.. పిల్లల్ని కనాలని ఆడ దోమలకి.. ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని అమ్మమ్మ, నాన్నమ్మ, తాతల దోమలకి ఉంటాయి కదండి. మరి వాళ్ళ కోరికలను నెరవేర్చడం కోసం అవి మనుషుల్ని, జంతువుల్ని కుడతాయి. వాకే, కానీ మనుషుల రక్తానికి, దోమల పిల్లలకి సంబంధం ఆఫ్ రిలేషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. దానికీ ఒక సైంటిఫిక్ కారణం ఉంది. అదేంటంటే.. సంతానోత్పత్తి కోసం ఆడ దోమలకి రక్తం కావాలి. అది మనుషులదైనా, జంతువులదైనా సరే.. రక్తం అయితే చాలు.
అలా అని ఇందులో బ్లడ్ గ్రూప్ లు చూసుకుని చూస్ చేసుకోవండోయ్. ఎర్రగా ఉంటే చాలు. సంతానోత్పత్తికి అవసరమైన గుడ్లను ఉత్పత్తి చేసుకోవడం కోసం దోమలు రక్తాన్ని తాగుతాయి. అవి పెద్ద మనిషి అయ్యాక అంటే సంతాన ప్రాప్తి వయసు వచ్చాక.. సంతానోత్పత్తికి కారణమయ్యే గుడ్లు ఏర్పడటానికి ప్రత్యేక ప్రోటీన్లు అవసరమవుతాయి. అవి రక్తం ఉన్న జీవుల నుంచే లభిస్తాయి. అంటే జంతువులు, మనుషులు వంటి క్షీరదాల్లో ఉండే ఎర్ర రక్తకణాల్లో దోమల గుడ్లు ఏర్పడేందుకు కావాల్సిన ప్రోటీన్లు ఉంటాయి. ఆ ప్రొటీన్ల కోసమే ఆడ దోమలు మనుషుల్ని, జంతువుల్ని కుడతాయి. అలా అని ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కుట్టవు. కేవలం సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చినప్పుడే కుడతాయి. ఆ సమయంలోనే వాటికి రక్త దాహం ఏర్పడుతుంది.
కేవలం ప్రత్యుత్పత్తి కోసమే అవి రక్తం తాగుతాయి తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు. కానీ మనుషులే అర్థం చేసుకోకుండా.. దోమల చక్రాలు, ఆలవుట్ లు పెట్టి.. హిట్ లు కొడుతూ వాటిని చంపేస్తున్నారు. వాటి సంతానోత్పత్తికి అడ్డు పడుతున్నారు. అలా అని సపోర్ట్ చేస్తే.. డెంగ్యూ వస్తుంది కదా. ఆడ దోమలు మాత్రమే దోమ పిల్లల కోసం మనుషుల్ని కుడతాయి. ఇక మగ దోమలంటారా.. అవి చెట్లంట, పుట్లంట తిరగడం తప్ప వాటికి ఏం చేతకాదు. పిల్లల్ని కనే శక్తి ఈ మగ దోమలకు లేదు కాబట్టి రక్తం తాగాల్సిన పని ఏముంటుంది? ఒకవేళ తాగాలనిపించి కుట్టడానికి వచ్చినా.. మనుషులు, జంతువుల చర్మాన్ని కొరికేంత శక్తి మగ దోమల పొడవాటి ముక్కుకి ఉండదు. చర్మం మందంగా ఉండడం వల్ల మగ దోమలు మనకెందుకండి.. ఈ రక్త చరిత్ర అని చెప్పి దూరంగా ఉంటాయి.
అదే ఆడ దోమలనుకోండి, వాటి ముక్కు చాలా బలంగా ఉంటుంది అందుకే ఇంజక్షన్ చేసినట్టు, సూది గుచ్చినట్టు కుడతాయి. మరి వాటికి మనం మనుషులం అని ఎలా తెలుస్తాయి అంటే.. చర్మం నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సయిడ్, కొన్ని వాసనలు గుర్తించి.. వీళ్ళు మనుషులు అని నిర్ధారించుకుని కుడతాయి. ఈ విషయంలో తమ లింగానికి చెందిన వారైనా సరే స్త్రీలను వదిలిపెట్టవు. ఈ విషయంలో ఆడ దోమలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆడ, మగ అనే ఎమోషన్స్ కి దూరంగా ఉంటాయి. అదన్నమాట విషయం. సంతానోత్పత్తికి గుడ్లు ఏర్పడాలి. ఆ గుడ్ల తయారీకి రక్తపు ఆహారం కావాలి. అది మనుషుల్లోనూ, జంతువుల్లోనూ ఉంటుంది. అందుకే ఆడ దోమలు మనుషుల్ని టార్గెట్ చేస్తాయి. దీని వెనుక ఇంత సైన్స్ ఉంది. మరి ఆడ దోమలు సంతానోత్పత్తి కోసం మనుషుల్ని కుట్టడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.