ప్రస్తుతం మగాళ్లని వేధిస్తున్న సమస్య బట్ట, పొట్ట. నిరుద్యోగంతో బాధపడే యూత్ కంటే బట్టతల, పొట్టతో బాధపడేవాళ్ళే ఎక్కువ. జిమ్ చేస్తేనో, తినడం తగ్గిస్తేనో పొట్ట తగ్గించే ప్రయత్నం చేయచ్చు. కానీ మాయదారి బట్ట అలా కాదే. వస్తే ఓ పట్టాన పోదు. బట్టతలకు పట్టుదల ఎక్కువనుకుంట. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాళ్ళని కూడా సాధించేస్తుంది. పిల్లనివ్వరేమో, పెళ్లి అవ్వదేమో అని టెన్షన్ పడుతుంటారు. దీని వల్ల డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోతారు. గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే కళ్ళు మూసుకుని స్మశానానికి వెళ్ళిపోయినట్టు.. బట్టతల పిలిస్తే డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కంటే ముందుగా వచ్చేది.. గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా ప్రేమించేది ఈ బట్టతలే.
బట్టతల అంటే ఒక ఎమోషన్ అనుకునేరు. అదొక నెగిటివ్ ఎమోషన్ అండీ బాబు. బట్టతల బాధితుల సంఘం ఉంది. దానికో ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ 6 వేలు ఫించను కోరుకుంటుంది. ఇటీవలే బట్టతల బాధితులు ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మగవారిని బట్టతల పేరుతో వేధిస్తే లైంగిక వేధింపుతో సమానం అని యూకే కోర్టు తీర్పునిచ్చింది లెండి. ఇలా ఉంటుంది బట్టతల బాధితుల సమస్యలు. పగోడికి కూడా ఈ సమస్య రాకూడదని అనుకుంటారు. అసలు ఈ బట్టతల మగాళ్లకే ఎక్కువగా వస్తుంది. ఎందుకు? మగాళ్లు చేసిన పాపం ఏమిటి అని అనిపించవచ్చు. కానీ ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఆడవాళ్ళ కంటే ఎక్కువగా మగాళ్లకే బట్టతల వస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఆడవాళ్లు కూడా హెయిర్ లాస్ సమస్యతో బాధపడతారు. కానీ వీళ్ళకి పెళ్లిళ్లు అయ్యాకే ఈ సమస్య వస్తుంది. 40, 50 ఏళ్ళ వయసులో బట్టతల సమస్య వస్తుంది. కానీ మగాళ్లకి అలా కాదు. పాతికేళ్లకే జుట్టు ఊడిపోతుంటుంది. జుట్టు పీక్కునే సమస్యలు లేకపోయినా కూడా జుట్టు ఊడిపోతుంటుంది. ఈ బట్టతల సమస్య ఈనాటిది కాదు. కొన్ని వందల ఏళ్లుగా ఈ సమస్య మగాళ్లని వేధిస్తుంది. బట్టతలకు కారణమయ్యే ఆండ్రోజెనిక్ అలోపేసియా ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగాళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళ జీవిత కాలంలో 40 శాతం బట్టతల వచ్చే అవకాశం ఉంటే.. మగాళ్లకు 70 శాతం బట్టతల వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
జుట్టు కుదుళ్లలో ఆండ్రోజెన్ రెసిప్టర్స్ ప్రభావం ఎక్కువైతే బట్టతల పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెసిప్టర్స్ టెస్టోస్టెరోన్ యొక్క ఉప ఉత్పత్తి అయిన డి హైడ్రో టెస్టోస్టెరోన్ తో కలిసి జుట్టు కుదుళ్లను నిర్జీవం చేస్తాయి. మగాళ్ల తమ జీవిత కాలం మొత్తం టెస్టోస్టెరోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, కాబట్టి డి హైడ్రో టెస్టోస్టెరోన్ అనేది తయారవుతూనే ఉంటుంది. ఇది అధిక బట్టతలకు కారణం అవుతుంది. మగాళ్లలో టెస్టోస్టెరోన్ ఉంటుంది కాబట్టే ఈ సారూప్య జన్యు స్వభావం లేని ఆడవాళ్ళ కంటే మగాళ్లకే ఎక్కువ బట్టతల వచ్చే అవకాశం ఉంది. ‘ఇన్నాళ్లు బట్టతలతో ఏడిపించింది ఈ టెస్టోస్టెరోన్ గాడా? నన్నొదలండి సార్.. ఆ టెస్టోస్టెరోన్ గాడ్ని ఏసేస్తాను’ అని అనాలనిపిస్తుందా? మీ ఆవేశంలో అర్థం ఉంది. అయితే ఆవేశంతో కాదు, ఆలోచనతో బట్టతల రాకుండా చూసుకోవచ్చు.
అయినా టెస్టోస్టెరోన్ ఏం చేసింది బోరో.. దాని ఉప ఉత్పత్తి అయిన డి హైడ్రో టెస్టోస్టెరోన్ గాడు చేస్తున్నాడు ఇదంతా. ఏదైనా కోపం ఉంటే వీడి మీద చూపించాలి. హార్మోన్ల ప్రభావం వల్ల కొంతమంది యూత్ కి 20వ ఏట ప్రారంభంలోనే హెయిర్ లాస్ సమస్య మొదలవుతుంది. యుక్తవయస్సులో హార్మోన్లు అనేవి జుట్టు వెంట్రులను ర్యాగింగ్ చేస్తాయి. దీని వల్ల యుక్తవయసులో వెంట్రుకలను కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంది. ఎందుకంటే మగాళ్ల జీవిత కాలంలో యుక్తవయసులోనే టెస్టోస్టెరోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. వంశంలో ఎవరికీ బట్టతల లేకపోయినా గానీ హార్మోన్లు అనేవి జుట్టు రాలే సమస్యను పెంచుతాయి. జుట్టుని బాగా పెంచేసి.. వెనక ఒక పిలక గట్టిగా లాగి ముడి వేసే లాంటి హెయిర్ స్టైల్స్ వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది.
జుట్టుని ఇబ్బంది పెడితే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. ఆ డి హైడ్రో టెస్టోస్టెరోన్ పోరాడాలా? మనుషులతో పోరాడాలా? అని నలిగిపోతూ వీర మరణం పొందుతుంది. అందుకే కొన్ని హెయిర్ స్టైల్స్ పేరుతో జుట్టుని బాధపెట్టకూడదని స్టడీస్ చెబుతున్నాయి. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్.. ఏంటి ఈ జుట్టు రాలే సమస్యకు అసోసియేషన్.. దానికి ప్రెసిడెంట్ కూడానా అని అనుకోకండి. లాస్ ఎక్కడుంటే అక్కడ అసోసియేషన్ లు, ప్రెసిడెంట్లు మొలుస్తారు. అమెరికన్ హెయిర్ లాస్ అసోసియేషన్ నివేదికల ప్రకారం.. 35 ఏళ్ళు దాటిన ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి బట్టతల వస్తుంది. 50 ఏళ్ళు వస్తే 85 శాతం మంది బట్టతల సమస్యను ఎదుర్కుంటున్నారు.
మరి ఇవే టెస్టోస్టెరోన్ అందరి మగాళ్లలో ఉంటుంది, యుక్తవయసులో ఈ టెస్టోస్టెరోన్ ఎక్కువగానే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఎందుకు అందరి మగాళ్లకు ఈ సమస్య రావడం లేదు అని మీకు అనుమానం ఆఫ్ ఇండియా వచ్చే ఉంటుంది. వాళ్లకి ఇతర మగాళ్లలా టెస్టోస్టెరోన్ కౌంట్ ఎక్కువగా ఉన్నా.. దాని ఉప ఉత్పత్తి అయిన డీ హైడ్రో టెస్టోస్టెరోన్ ప్రభావం ఉన్నా, హార్మోన్లు ఎక్కువ ఉన్నా కూడా బట్టతల రాకపోవడానికి కారణం.. జుట్టుని ర్యాగింగ్ చేసే రిసెప్టర్స్ తక్కువగా ఉండడమే. వంశంలో తండ్రికి బట్టతల ఉన్నా కూడా రాకపోవడానికి కారణం ఇదే. జుట్టుకి కెమికల్స్ తో కూడిన క్రీములు వాడడం, ఓవర్ స్టైలింగ్ వంటి గత్తర పనుల వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉందని స్టడీస్ చెబుతున్నాయి. హెయిర్ డైలోనే డై ఉంది. అంటే చావుని ప్లగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నట్టే.
ఇక హీట్ వల్ల కూడా జుట్టు పాడవుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలని స్టడీస్ చెబుతున్నాయి. మితిమీరిన విటమిన్ ఏ వల్ల కూడా హెయిర్ లాస్ సమస్య వస్తుందని స్టడీస్ చెబుతున్నాయి. అందుకే డైట్ ని కరెక్ట్ గా బ్యాలన్స్ చేసుకుంటూ.. ఆరోగ్యకరమైన ఆహారం తింటే జుట్టు పెరుగుదల అనేది బాగుంటుంది. ఐరన్, జింక్, విటమిన్ డి, విటమిన్ ఏ, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభించే ఆహార పదార్థాలు తినడం వల్ల జుట్టు పెరుగుదలని, జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింకులు తాగడం వల్ల బట్టతల వచ్చే ప్రమాదం 30 శాతం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్ టీ, కాఫీ, ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తాగేవారికి బట్టతల సమస్య అధికంగా ఉంటుందట.
వారానికి 1 నుంచి 3 లీటర్ల చొప్పున ఈ పానీయాలు తీసుకుంటే బట్టతల వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి. తియ్యని డ్రింక్స్ తాగని వారితో పోలిస్తే.. తాగేవారిలో 42 శాతం హెయిర్ లాస్ ఉంటుంది. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారు కూడా హెయిర్ లాస్ కి గురవుతారట. ఫాస్ట్ ఫుడ్ వల్ల డైరెక్ట్ గా బట్టతల సమస్య రాదు గానీ.. ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎలాంటి పోషకాలు లభించవు. పోషకాల లోపం వల్ల బట్టతల వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించమని స్టడీస్ చెబుతున్నాయి. ఇక ఆందోళనకు గురయ్యేవారు కూడా హెయిర్ లాస్ బాధితుల జాబితాలో చేరిపోయే అవకాశం ఎక్కువగానే ఉన్నట్టు స్టడీస్ చెబుతున్నాయి. అదండి విషయం. ఆడవారి కంటే మగవారికే ఎక్కువ బట్టతల రావడం వెనుక ఉన్న అసలు వాస్తవాలు. మరి బట్టతల రావడానికి గల కారణాలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.