ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే మా లక్ష్యం.. ఆ దిశగానే మేం పనిచేస్తాం అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రారంభం సందర్భంగా అదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. అందులో భాగంగానే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కేసీఆర్ సర్కార్ పింఛన్ ఇస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వద్దకు కొత్త డిమాండ్ వచ్చింది. తమకు కూడా పింఛన్ కావాలంటూ బట్టతల బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
అవును.. మీరు చదివింది నిజమే. తమకు కూడా పింఛన్ కావాలంటూ బట్టతల బాధితులు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కల్లా వారికి రూ.6 వేల పింఛన్ మంజూరు చేయాలంటూ కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామంలో బట్టతల బాధితుల సంఘం సమావేశం నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సమావేశమేన వీళ్లు.. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నూతన అధ్యక్షుడిగా వెల్ది బాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని కూడా నియమించుకున్నారు.
వీళ్లని మానసిక వికలాంగుల కింద గుర్తించాలని బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. మానసిక వికలాంగుల కింద పరిగణించి రూ.6 వేల పింఛన్ మంజూరు చేయాలన్నారు. సమాజంలో తాము చాలా అవమానాలను ఎదుర్కొంటున్నట్లు వివరించారు. తమ డిమాండ్లను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. జిల్లా సంఘాలు ఏర్పాటు చేసి ప్రగతి భవన్ సైతం ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ బట్టతల బాధితుల సంఘం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.