ఒరేయ్ బాబ్జీ రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే.. వెనకాల బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదంలో పడతారని ఎప్పుడైనా అనుకున్నావా? అయ్ బాబోయ్ రైలులో నిద్రపోకూడదు అంతే కదా. మరి బుజ్జిగాడు చెప్పిన మాట వినకుండా రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా?
బస్సుల్లో, కార్లలో, రైళ్లలో వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు నిద్ర రావడం సహజం. ప్రయాణికులు నిద్రపోయినా పెద్ద సమస్య లేదు. కానీ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు కూడా నిద్ర వస్తుంటుంది. ముఖ్యంగా రాత్రిపూట డ్యూటీ చేసే డ్రైవర్లకు నిద్ర వస్తుంటుంది. అలా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే వాహనాన్ని ఎక్కడైనా ఆపి ముఖం కడుక్కుని మళ్ళీ వాహనం ఎక్కుతారు. ఇంకొంతమంది అయితే కండక్టర్ కో, క్లీనర్ కో ఇచ్చి డ్రైవ్ చేయమంటారు. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా పోనిచ్చి ప్రమాదానికి కారణమవుతారు. అయితే రైలు నడుపుతుండగా పైలట్ పొరపాటున నిద్రలోకి జారుకుంటే ఏమవుతుందో తెలుసా? బస్సులోనో, కారులోనో డ్రైవర్ నిద్ర మత్తులో తూలుతుంటే రెండు పీకి.. నువ్వు పడుకోకురా సామి అని దండం పెడతాం.
మరి ఎక్కడో చివరన ఇంజన్ బోగీలో ఉన్న లోకో పైలట్లను ఎలా నిద్ర లేపగలం. అసలు వాళ్ళు నిద్రపోతున్నారో, ఏం చేస్తున్నారో అనే విషయం కూడా తెలియదు. మరి ఈ విషయం ఎవరు గుర్తిస్తారు? ప్రమాదాలు జరక్కుండా ఎవరు కాపాడతారు? మళ్ళీ మార్వెల్ స్టూడియోస్ నుంచి సూపర్ మ్యాన్ లు, స్పైడర్ మ్యాన్ లు వస్తారేంటి? అబ్బే అంత బడ్జెట్ లేదండి మనకి. సాధారణంగా రైలులో ఇద్దరు లోకో పైలట్లు ఉంటారు. ఒకరు సీనియర్ లోకో పైలట్, మరొకరు అసిస్టెంట్ లోకో పైలట్. ఇద్దరిలో ఒకరు అనుకోకుండా నిద్రలోకి జారుకుంటే.. మరో పైలట్ లోకో పైలట్ ను అప్రమత్తం చేస్తారు. ఒకవేళ ఇద్దరూ నిద్ర మత్తులోకి వెళ్తే ఏంటి పరిస్థితి? రైలు ప్రమాదానికి గురవ్వదా? అంటే అవ్వదు. ఎందుకంటే ప్రతీ రైలులో లోకో పైలట్లను అప్రమత్తం చేసే డివైజ్ లు ఉంటాయి.
లోకో పైలట్లు స్పందించకపోతే రైలు దానికదే ఆగిపోయేలా పరికరం పని చేస్తుంది. రైలులో పొరపాటున లోకో పైలట్లు నిద్రపోతే ప్రమాదం జరక్కుండా ఉండడం కోసం ఒక పరికరం ఉంటుంది. లోకో పైలట్లు ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే.. విజిలెన్స్ కంట్రోల్ డివైజ్ అనే మైక్రో కంట్రోలర్ భద్రతా పరికరం లోకో పైలట్లను అలర్ట్ చేస్తుంది. అంతేకాదు లోకో పైలట్ అసమర్థతను గుర్తించి స్వయంగా రైలుకు బ్రేకులు అప్లై చేస్తుంది. ప్రతీ 60 క్షణాలు లోకో పైలట్ ఏదో ఒక మూమెంట్ ఇస్తూ ఉండాలి. అంటే రైలులో ఏదో ఒకటి ఆపరేట్ చేస్తూ ఉండాలి. హారన్ కొట్టడం, రైలు వేగం పెంచడం, తగ్గించడం లాంటివి చేస్తుండాలి.
ఒకవేళ పైలట్ల నుంచి ఎలాంటి మూమెంట్ లేకపోతే ఇంజన్ లో ఉన్న లైటు 8 క్షణాల పాటు బ్లింక్ అవుతూ బజ్జర్ సౌండ్ మోగుతుంది. అప్పటికీ లోకో పైలట్లు స్పందించకపోతే ఇంజన్ కి ఆటోమేటిక్ గా బ్రేకులు అప్లై అయ్యి రైలు ఆగిపోతుంది. మళ్ళీ రైలు కదలాలంటే విజిలెన్స్ డివైజ్ ను ఆపాలి. దీన్ని ఆపాలంటే రీసెట్ బటన్ ను ఆపి 3 నిమిషాల పాటు నొక్కాలి. అదండి విషయం. రైలులో ఇద్దరు లోకో పైలట్లు పొరపాటున నిద్రపోతే గనుక వారిని అప్రమత్తం చేసే డివైజ్ ఉంటుంది. 8 క్షణాల్లో స్పందించకపోతే రైలు ఆగిపోయేలా ఆ డివైజ్ పని చేస్తుంది. అందుకే లోకో పైలట్లు కదలకుండా ఉండకుండా ఏదో ఒక దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.