దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో రైలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. సూదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపిస్తుంటారు.
భారతీయులకు, రైల్వేలకు విడదీయరాని అనుబంధం ఉందని అంటారు. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా బస్సు కన్నా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. రైలులో అన్ని రకాల వసతులు కల్పించబడతాయి. ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసుకునేవారు ఎక్కువ రైలు ప్రయాణాలకే మొగ్గు చూపిస్తుంటారు. తాజాగా రైలు ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.
రైలు ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త వెల్లడించింది. వందేభారత్ సహా పలు రైళ్లలో ప్రయాణించేవారికి చార్జీలను 25 శాతం వరకు దగ్గింగే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏసీ సిట్టింగ్ సదుపాయం ఉన్న ట్రైన్స్ లో ఈ తగ్గింపు నిర్ణయాన్ని తీసుకునే అధికారం జోనల్ రైల్వేలకు అప్పగించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మందికి ఎంతో ఊరట కలుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. రైళ్ల ఆక్యూపెన్సీనీ పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెనిఫిట్ ఎంపిక చేసిన రైల్వే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఏసీ చెయిర్ కార్ సహా అన్ని రైళ్లలో 25 రాయితీ చార్జీల పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు ఆయా జోనల్ రైల్వే అధికారులకు అధికారం ఇస్తున్నట్లు భారతీయ రైల్వే శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎసీ చెయిర్ కార్, ఎగ్జిక్యూటీవ్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ ఆఫర్ లభించనుంది.
గడిచిన 30 రోజుల్లో దాదాపు 50 శాతం కన్నా తక్కువ ఆక్యూ పెన్సీ ఉన్న రైళ్లలో ఈ ఆఫర్ ప్రకటించాలని అధికారులకు తెలిపింది. రైళ్లలో వసతులు వీలైనంత ఎక్కువగా సద్వినియోగం అయ్యే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వందే భారత్ సహా అన్ని రకాల ఏసీ కోచ్ లు ఉన్న రైళ్లలో ట్రైన్ టికెట్స్ ధర తగ్గింపు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. అయితే రైలు టిక్కెట్ మూల ఛార్జీలో గరిష్ఠంగా 25 శాతం డిస్కౌంట్ ప్రయాణికునికి లభిస్తుంది. రిజర్వేషన్ చార్జీలు, సూపర్ ఫాస్ట్ సర్ చార్జ్, జీఎస్‌టీ వంటివి అలాగే ఉంటాయి. టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తించదని.. అలాగే ఎటువంటి తిరిగి చెల్లింపులు ఉండబోవని వివరించింది. హాలిడేస్, పండుగల సమయంలో నడిపే ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తించదు అని తెలిపింది.