ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా లంచగొండి అధికారిని పట్టుకున్న తర్వాత పింక్ రంగులో ఉన్న సీసాలను ఉంచుతారు. అలా ఎందుకు పెడతారో, దీనికి గల కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి చిలక్కి చెప్పినట్టు చెప్పినా ఇచ్చేవారు ఆపలేదు, తీసుకునేవారూ ఆపలేదు. లంచం లేకుండా ఇక్కడ పని జరగదు అన్న పరిస్థితికి తీసుకొచ్చేసారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే లంచం, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే లంచం, పింఛను పొందాలంటే లంచం.. ఇలా తమ బాధ్యతను నిర్వర్తించడానికి జీతం ఇస్తున్నా కూడా లంచం అడుగుతారు కొంతమంది. ప్రజల పనులు చేయడానికే కదా పన్నులు కట్టేది. ఆ పన్నుల నుంచే కదా ప్రభుత్వాధికారులకు జీతాలు వెళ్ళేది. మరి ఆ పనులు చేయించుకోవడానికి లంచం ఇవ్వడం దేనికో అర్థం కాదు. కానీ ఇలాంటి లంచగొండులను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వల వేస్తారు.
పలానా ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడని బాధితుడు ఒక్క మాట చెబితే వెంటనే రంగంలోకి దిగిపోతారు. బాధితుడికి కొంత అమౌంట్ ఇచ్చి పంపించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. అయితే లంచగొండిని పట్టుకున్న తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు పింక్ రంగులో సీసాలు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా ఆ సీసాలు అక్కడ ఎందుకు ఉంటాయో అని. ఏసీబీ అధికారులకు, ఆ పింక్ సీసాలకు సంబంధం ఏమిటి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఐతే ఆ సీసాలు అక్కడ ఉండడానికి ఒక కారణం ఉంది. నిజానికి ఆ సీసాల వల్లే అధికారి లంచం తీసుకున్నాడా లేదా అనేది కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కుదురుతుంది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నాడో లేదో తెలుసుకోవడం కోసం బాధితుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి పంపుతారు.
పంపే ముందు నోట్లపై ఫినాఫ్తలీన్ పౌడర్ ని చల్లుతారు. ఇది కంటికి కనిపించదు. కరెన్సీ నోట్ల మీదనే కాదు ఐఫోన్, ల్యాప్ టాప్, కెమెరా వంటి వస్తువులను లంచంగా డిమాండ్ చేసిన తరుణంలో వాటి మీద కూడా పౌడర్ చల్లుతారు. ఆ కరెన్సీ నోట్లను లంచగొండి పట్టుకున్నాడు అని తెలియగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఆ సమయంలో వారి వెంట తెచ్చుకున్న సోడియం కార్బోనేట్ ద్రావణాన్ని ఒక గ్లాసులో పోస్తారు. ఆ లంచగొండిని తన వేళ్ళను ఆ గ్లాసులో ముంచమని ఏసీబీ అధికారులు అడుగుతారు. లంచగొండి తన వేళ్ళను ముంచగానే తన వేళ్ళకు ఉన్న ఫినాఫ్తలీన్ పౌడర్ సోడియం కార్బోనేట్ తో కలిసి పింక్ రంగులోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అంటే ఆల్కలైన్ రసాయనం, ఫినాఫ్తలీన్ ఈ రెండూ కలిసి పింక్ రంగుగా ఏర్పడతాయి. ఈ పింక్ రంగు రసాయనాన్ని గాజు సీసాల్లో పోసి కోర్టులో సాక్ష్యంగా చూపించి శిక్ష పడేలా చేస్తారు.