ఏ వాహనమైన అడ్డు వస్తే కొట్టడానికి తప్పితే హారన్ కంటూ ఒక ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ రైలు హారన్ అలా కాదు. హారన్లలో 11 రకాలు ఉన్నాయి. ఈ 11 రకాల హారన్లు ఒక్కో దానికి సంకేతంగా ఉంటాయి.
వాహనాలకు హారన్ అనేది చాలా ముఖ్యం. ముందున్న వాహనాన్ని పక్కకి జరగవాయ్ అని చెప్పడానికి హారన్ అనేది కొడతారు. దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల హారన్లు ఒకేలా ఉంటాయి. శబ్దాలు వేరేగా ఉన్నా అవి మోగే విధానం ఒకలానే ఉంటుంది. అయితే బస్సులు, లారీల హారన్లు వేరేగా ఉంటాయి. షార్ట్ హారన్లు, లాంగ్ హారన్లు ఉంటాయి. మహా అయితే రెండు రకాల హారన్లు ఉంటాయి ఏ వాహనానికైనా. కానీ రైలులో మాత్రం 11 రకాల హారన్లు ఉంటాయి. రైలులో వెళ్తున్నప్పుడు గానీ లేదా రైలు సమీపంలో ఉన్నప్పుడు గానీ హారన్స్ వినే ఉంటారు. అయితే అన్ని హారన్లు ఒకేలా ఉండవు. కొన్ని లాంగ్ హారన్స్, కొన్ని షార్ట్ హారన్స్, రెండు సార్లు రిపీట్ అవ్వడం ఇలా ఉంటాయి. అయితే మీకు తెలుసా రైళ్లలో 11 రకాల హారన్స్ ని ఉపయోగిస్తారని.
రైలు నుంచి ఒక చిన్న హారన్ వినిపిస్తే కనుక దానర్థం.. తదుపరి ప్రయాణం కోసం రైలుని యార్డులో శుభ్రం చేయడానికి తీసుకెళ్తున్నట్టు. అదే రెండు చిన్న హారన్లు వినిపిస్తే కనుక.. దానర్థం రైలుని ప్రారంభించడానికి రైల్వే సిగ్నల్ ని డైరెక్ట్ చేయమని గార్డుని అడుగుతున్నట్టు. మూడు చిన్న హారన్లు చేస్తే కనుక లోకోపైలట్ రైలుపై నియంత్రణ కోల్పోయాడని అర్థం. నియంత్రణ కోల్పోయిన సమయంలో ఈ హారన్ మూడు సార్లు వినిపిస్తుంది. ఇది వాక్యూమ్ బ్రేక్ ని వెంటనే లాగడానికి సిగ్నల్ గా కూడా పని చేస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా వినిపిస్తుంది. నాలుగు చిన్న హారన్లు వినిపిస్తే కనుక.. రైలుతో ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్టు. అంతేకాదు రైలు ముందుకు వెళ్ళదు అని కూడా సూచిస్తుంది.
హారన్ కంటిన్యూగా మోగితే కనుక ఎలాంటి హాల్ట్స్ లేకుండా రైలు స్టేషన్ల గుండా వెళ్తుందని అర్థం. ఇది ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక లాంగ్ హారన్, ఒక షార్ట్ హారన్ వినిపిస్తే కనుక రైలింజన్ ని స్టార్ట్ చేసే ముందు బ్రేక్ పైప్ ని సెట్ చేయమని గార్డుకి సిగ్నల్ ఇస్తున్నట్టు అర్థం. రెండు లాంగ్ హారన్లు, రెండు షార్ట్ హారన్లు కొడితే కనుక లోకో పైలట్ రైలింజన్ కంట్రోల్ చేయమని గార్డుకి సంకేతం ఇస్తున్నాడని అర్థం. అదే హారన్ కి, హారన్ కి మధ్య చిన్న పాస్ ఇచ్చి రెండు హారన్లు కొడితే కనుక రైల్వే క్రాసింగ్ గుండా రైలు వెళ్తుందని అర్థం. అలానే అటువైపుగా వచ్చే బాటసారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. రెండు లాంగ్ హారన్లు, షార్ట్ హారన్లు వింటే కనుక రైలు పట్టాలు మారుతున్నట్టు అర్థం. రెండు షార్ట్ హారన్లు, ఒక లాంగ్ హారన్ వింటే కనుక.. ప్రయాణికుడు చైన్ లాగినట్టు లేదా గార్డు వాక్యూమ్ బ్రేక్ ని లాగినట్టు అర్థం. ఆరుసార్లు షార్ట్ హారన్ వినబడితే కనుక.. ప్రమాదకర పరిస్థితుల్లో రైలు ఇరుక్కుందని అర్థం. ఇవే 11 రకాల రైలు హారన్లు, వాటి సంకేతాలు.