పెళ్ళైన తర్వాత కొత్త జంట హనీమూన్ కి వెళ్తుంటుంది. అసలు పెళ్ళికి, హనీమూన్ కి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా? హానీ అంటే తేనె, మూన్ అంటే చంద్రుడు ఈ రెండిటికీ సంబంధం ఏమిటి? ఈ రెండింటితో పెళ్ళికి ఉన్న సంబంధం ఏమిటి?
కొత్తగా పెళ్ళైన జంటను హనీమూన్ ట్రిప్ కి పంపిస్తుంటారు పెద్దలు. అయితే హనీమూన్ కి వెళ్లడం అనే సంస్కృతి ఈనాటిది కాదు. 4 వేల ఏళ్ల నుంచే ఈ సంస్కృతి ఉంది. హనీమూన్ అనే పదం హనీమంత్ అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి మూలాలు బాబిలోన్ లో ఉన్నాయి. హనీమూన్ అనేది పెళ్లి అయిన తర్వాత ఒక నెల తర్వాత వచ్చేది. వధువు తండ్రి వరుడికి హనీ బీర్ (తేనెతో చేసినటువంటి ఆల్కహాల్) ని ఇస్తారు. పెళ్ళైన తర్వాత నెల రోజుల పాటు ఈ హనీ బీర్ ని తాగాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే తేనెలా మధురంగా గా ఉంటుందని అప్పటి జనం విశ్వసించేవారు. అయితే అప్పట్లో హనీమూన్ అనే పదం లేదు. హనీమంత్ అనేవారు. అప్పట్లో బాబిలోనియన్స్ హనీ మంత్ అని పిలిచేవారు. అది కాస్తా ఇప్పుడు హనీమూన్ అయ్యింది.
హనీమూన్ అయినా, హనీమంత్ అయినా పేరు ఏదైనా గానీ చంద్రుడితో సంబంధం ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ కొత్త జంట జరుపుకునే తియ్యని వేడుకకు, చంద్రుడికి సంబంధం ఉంది. అదేంటంటే అప్పట్లో పెళ్ళైన జంట బాబిలోన్ క్యాలెండర్ ప్రకారం లూనార్ మాసంలో హనీ బీర్ తాగేవారు. చంద్రుడు అనే పదం రుతువుల చక్రాన్ని సూచిస్తుంది. బాబిలోన్ క్యాలెండర్ ప్రకారం ఆ మాసాన్ని లూనార్ క్యాలెండర్ గా భావించేవారు. లూనార్ అంటే చంద్రుడు. చంద్రుడు అమావాస్య స్థితి నుంచి నిండు వెన్నెలగా మారే స్థితికి వస్తాడు. అలానే కొత్తగా పెళ్ళైన జంట కూడా ఎలాంటి ప్రేమ లేని స్థితి నుంచి ఒకరిపై ఒకరు వెన్నెలలా ప్రేమని కురిపించుకునే స్థితికి రావాలనే దానికి సంకేతంగా పెట్టారు.
ఈ రకంగా హనీమంత్ కి చంద్రుడితో సంబంధం ఉంది కనుకనే ఆ తర్వాత కాలంలో హనీమంత్ ని హనీమూన్ అని పిలవడం మొదలుపెట్టారు. హనీమూన్ అనే పదాన్ని మొదటగా 1546వ సంవత్సరంలోని ఒక పద్యంలో ఉపయోగించారు. సంతోషాన్ని వ్యక్తపరచడానికి హనీమూన్ అనే పదాన్ని వాడారు. 1592లో హనీమూన్ అనే పదం రాబర్ట్ గ్రీన్ అనే బ్రిటిష్ రచయిత ఆఖరి రచనలో కనిపించింది. ‘పెళ్ళైన తర్వాత కొత్త జంట హనీమూన్ కి వెళ్తారు, అది నెల రోజుల సమయం ఉంటుంది’ అని ఆ రచనలో చెప్పబడింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం.. ‘హనీమూన్ అనేది ఒక నెల రోజుల పాటు ఉండే మధురమైన కాలం. అలానే చంద్రుడు చిన్నగా అయిపోతున్నట్టు కొత్త జంట మధ్య ప్రేమ కూడా క్షీణిస్తుంది’ అని చెప్పడాన్ని సూచిస్తుంది.
హనీమూన్ లో ఉన్నంత హ్యాపీగా, సుఖంగా ఆ తర్వాత కొత్త జంట ఉండలేరు. ఈ మార్పును సూచించడానికే చంద్రుడ్ని వాడినట్లు తెలుస్తోంది. చంద్రుడు నిండు వెన్నెల కురిపించే స్థితి నుంచి అమావాస్య రోజున కనిపించకుండా పోయే స్థితికి వచ్చేస్తాడు. ఈ మార్పే కొత్తగా పెళ్ళైన జంటలో మునుముందు కనిపిస్తుందని చెప్పడానికి సంకేతంగా చంద్రుడ్ని వాడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రుడితో హనీమూన్ కి పాజిటివ్ గా, నెగిటివ్ గా సంబంధం అయితే ఉంది. అందుకే హనీమూన్ అని పిలుస్తారని అర్థమవుతోంది. అదన్నమాట విషయం. మరి హనీమూన్ ని హనీమూన్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది కదూ. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.