తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగోడి గుర్తింపును ప్రపంచ నలుమూలలకు చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన చిత్రంతో నాణాలను విడుదల చేయనుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే?
తెలుగు సినిమాలను, తెలుగు రాజకీయాలను శాసించిన లెజెండరీ పర్సన్ నందమూరి తారక రామారావు. తెలుగోడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. అయితే దురదృష్టం కొద్దీ ఆయనకు భారత ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు దక్కలేదు. దీంతో ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వెలుగు చూడలేకపోయింది. కానీ మనం త్వరలోనే రూ. 100 నాణాల మీద ఎన్టీఆర్ బొమ్మను చూడబోతున్నాము. అది కూడా వెండి నాణాల మీద. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం ఎన్టీఆర్ బొమ్మతో వెండి నాణాలు ముద్రించాలని ఆర్బీఐని కోరింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు భారత రిజర్వ్ బ్యాంక్.. మింట్ అధికారులను మాజీ కేంద్ర మంత్రి మరియు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని సంప్రదించవలసిందిగా కోరింది.
ఈ క్రమంలో పురంధేశ్వరిని మింట్ అధికారులు కలిసినట్లు తెలుస్తోంది. మింట్ అధికారి ఒకరు పురంధేశ్వరిని కలిసిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మే 28 2022 నుంచి మే 28 2023 వరకూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని నందమూరి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఎన్టీఆర్ బొమ్మను రూ. 100 నాణెం మీద ముద్రించడానికి రిజర్వ్ బ్యాంక్ తో మాట్లాడినట్లు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 2022 మే 28న వెల్లడించిన విషయం తెలిసిందే. రూ. 100 నాణెం మీద ఎన్టీఆర్ బొమ్మను ముద్రించడం కోసం ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నామని, చర్చలు సఫలీకృతమవుంతుందని ఆమె భావించారు. అయితే తాజాగా ఆ చర్చలు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది.
మింట్ అధికారులు పురంధేశ్వరిని కలిసి ఎన్టీఆర్ చిత్రం గురించి సలహాలు అడిగినట్లు.. అలానే కొన్ని ఆలోచనలు చర్చించుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ శత జయంతి నాడు అనగా 28 మే 2023 న ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ. 100 నాణాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎన్టీఆర్ కి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. చారిత్రక ఘటనలు, ప్రముఖుల త్యాగాల గుర్తుగా నాణాలను విడుదల చేసే పధ్ధతి 1964 నుంచి ప్రారంభమైంది. తొలుత నెహ్రూ స్మారకార్థం నాణెంను విడుదల చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయ్ బొమ్మతో కూడా నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లెజెండరీ నటుడు, గొప్ప నాయకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు బొమ్మతో రూ. 100 వెండి నాణాలు విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.