ప్రజలకు ఏ అత్యవసరం వచ్చినా ఒకే నంబర్‌కు కాల్ చేసే వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితిలో ఉన్నపుడు సహాయక బృందాలకు ఫోన్ చేయడానికి ఉన్న వేరువేరు నంబర్లను క్రమంగా తీసివేసి వాటిస్థానంలో అన్ని అత్యవసర సర్వీసులకు ఒకే నంబర్ 112 ఉండాలని ట్రాయి (టెలికం రేగ్యులేటరి అథారిటి ఆఫ్ ఇండియా) ప్రతిపాదించింది. ప్రస్తుతం అంబులెన్స్ కు, పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి వేరు వేరుగా 100, 101, 102, 108 నంబర్లను ఉపయోగిస్తున్నారు.
ప్రజలు వారున్న అత్యవసర పరిస్థితుల్లో ఏ నంబర్ కు ఫోన్ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ పోలీస్‌శాఖ సైతం దీనిపై దృష్టి సారించింది. అతి త్వరలో ఈ నంబర్‌ను పూర్తిస్తాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ విధానం దాదాపు అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖలను ఈ నంబర్‌కు అనుసంధానించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు.
వందల మంది ఒకేసారి ఫోన్‌చేసినా వారి కాల్స్ స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 112 నంబర్‌పై ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఏ ఆపద వచ్చినా ఒకే నంబర్‌కు ఫోన్ చేసే అవకాశం అక్కడ ఉంది. దీంతో మనదేశంలో కూడా అన్ని ఎమర్జెన్సీలకు ఒకే నంబర్‌ను అందుబాటులోకి ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. వచ్చే ఏడాది నాటికి ఈ నెంబరు దేశమంతటా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
స్మార్ట్‌ఫోన్‌లో ‘పవర్ బటన్’ను మూడు సార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందుతుంది. సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్ ప్రెస్ ద్వారా కూడా ఈ సేవలు పొందే అవకాశం ఉంది.