మనం రోడ్డుపై కారులో వెళ్తున్నాం.. ముందు చూస్తే భారీగా ట్రాఫిక్‌జామ్… ఎటు చుసినా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతే మనకు ఏమనిపిస్తుంది?. అబ్బా.. ఈ టైములో గాలిలో ఎగిరే కారు ఉండాలి కానీ.. రయ్యున వెళ్లిపోయేవాళ్లం. ఇలాంటి ఆలోచన అందరకి వచ్చే ఉంటుంది. అలా గాలిలో ఎగిరే కారు నిజంగానే రాబోతోంది. ఇప్పటిదాకా పలు కంపెనీలు ప్రోటోటైప్ ఫ్లయింగ్ ట్యాక్సీలను తెచ్చినప్పటికీ వాస్తవరూపంలోకి రాలేదు. తాజాగా.. ఒక యూరప్ కంపెనీ 2027 కల్లా మార్కెట్లోకి తెస్తామంటోంది.
యూరప్, స్లొవేకియన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన.. ఏరోమొబిల్ సంస్థ ప్రపంచంలోనే మొదటి ఫోర్‌సీటర్ ఫ్లయింగ్ ట్యాక్సీని ఆవిష్కరించింది. దీని పేరు ఏఎం నెక్ట్స్(AM NEXT). మరో ఐదేళ్లలో ఇది వినియోగంలోకి రానుంది. 2027 కల్లా 500 మైళ్ల దూరానికి ప్రయాణికులను తీసుకెళ్లేటట్లు దీన్ని రూపొందిస్తున్నారు. ఈ కంపెనీ రూపొందించిన రెండో ఫ్లయింగ్ కారు ఇది. సూపర్‌కార్, తేలికపాటి విమానాల లక్షణాలుండే ఈ కారు మూడు నిమిషాల వ్యవధిలో తన ‘మోడ్’ను (అంటే రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగరడం.. గాల్లో నుంచి రోడ్డు మీదికి దిగడం) మార్చుకోగలదు.ఈ కంపెనీ మొదట రూపొందించిన టూసీటర్ ఫ్లయింగ్ కారు ఏఎం 4.0(AM4.0). ఈ మోడల్‌ను 2017లో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ప్రదర్శించారు. గాలిలో గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎగిరేలా దీన్ని రూపొందించారు. రోడ్డుపై దీని గరిష్టవేగం గంటకు 160 కి.మీ. దీని ఖరీదు రూ10 నుంచి 12 కోట్ల వరకు ఉంది. ఈ ఫ్లయింగ్ కారును గాలిలో నడపాలంటే మాత్రం పైలట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కారును వచ్చే ఏడాదికి మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు 2024కు గానీ అందుబాటులోకి రానుంది.
ఇలాంటి గాలిలో ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తే వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లే. ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు, ఇంధన సమస్యలు, కాలుష్య సమస్యలు.. ఇలా ఎన్నో రకాలుగా మేలు జరగనుంది. సైనిక రంగాన్ని వీటితో మరింత బలోపేతం చేయవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.