ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే మన దేశంలో సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే 6జీ కూడా అందుబాటులోకి రానుంది అని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
ప్రస్తుతం మన దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయిని.. త్వరలోనే దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు కూడ ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా టెలికాం సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ.. 6జీ విజన్ డాక్యుమెంట్‌ని ఆవిష్కరించారు. మరో 2, 3 సంవత్సరాల్లో ఇండియాలో 6జీ సేవలు కూడా ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణబ్ మాట్లాడుతూ.. 6 జీ సేవల్లో..భారతదేశం ప్రముఖ పాత్ర పోషించనుందని ప్రకటించారు.
సోమవారం.. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ ఫ్లాగ్‌షిప్ వార్షిక సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన టెలికాం మంత్రి అశ్విని వైష్ణబ్ మాట్లాడుతూ.. ‘‘6జీ వైర్‌లెస్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కోరిక. దీని గురించి గత ఏడాది మోదీ మాకు టార్గెట్ ఇచ్చారు. 4జీ, 5జీ సాంకేతికతలో మనం ప్రపంచంతో సమానంగా ఉన్నాం.. కానీ 6జీ విషయంలో మాత్రం.. మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలి. సాంకేతికత అభివృద్ధికి మనమే నాయకత్వం వహించాలని మోదీ మాకు లక్ష్యంగా ఇచ్చారు. మేం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే 6జీ టెక్నాలజీ కోసం 127 పేటెంట్లను పొందాం’’ అని తెలిపారు.
‘‘చాలా సంవత్సరాలుగా, స్థానిక ప్రతిభ, సాంకేతికత, స్థానిక మౌలిక సదుపాయాలను ఉపయోగించి, భారతదేశం.. మన కోసం, ప్రపంచం కోసం పరిష్కారాలు, ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.. పంపిణీ చేసింది. అయితే నరేంద్ర మోదీ వచ్చాక అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వినియోగ ఆధారిత వృద్ధికి బదులుగా పెట్టుబడి ఆధారిత వృద్ధిని మోదీ విశ్వసించారు. ఆయన వ్యూహమే.. భారతదేశాన్ని మహమ్మారి నుంచి బయటపడేలా చేసింది. మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల పెట్టడం వల్ల.. 6.2 శాతం వృద్ధి రేటు, మితమైన ద్రవ్యోల్బణంతో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి సాయపడింది’’ అని చెప్పుకొచ్చారు.
‘‘అనేక రంగాలు, పరిశ్రమలకు సంబంధించి.. మన ప్రభుత్వం ఇక్కడి ప్రతిభను ఉపయోగించుకుని.. దేశం కోసం, ప్రపంచం కోసం ఉత్పత్తులను తయారు చేయాలని భావించింది. ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని రంగాల్లోని గ్లోబల్ సీఈవోలు, నాయకులు, శాస్త్రవేత్తలను నేను ఆహ్వానిస్తున్నాను. నమ్మకమైన సాంకేతిక ఉత్పత్తికిగాను ఇండియాను మీ ఇంటిగా భావించండి. మీరు దేశం కోసం, ప్రపంచం కోసం నమ్మకమైన సాంకేతికతను అభివృద్ధి చేయండి’’ అని పిలపునిచ్చారు.