వేసవి కాలం వచ్చేసింది. మరి కొద్ది రోజులైతే ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. వేసవి తాపాన్ని భరించడం కోసం చాలామంది ఎండాకాలంలో కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. మరి ఈ వేసవికి మీరు ఏసీ కొనాలనుకుంటున్నా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే..
సాధారణంగా వేసవి కాలం అంటే మార్చి-ఏప్రిల్ మధ్యలో ప్రారంభం అవ్వాలి. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు దృష్ట్యా.. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటిందంటే చాలు.. సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత బాగా పెరిగి.. ఉక్కపోత పోస్తుంది. ప్రస్తుతం ఫ్యాన్ గాలికి సేదదీరుతున్నాం. కానీ రాను రాను ఎండలు మండిపోతాయి. ఫ్యాన్ గాలి కూడా వేడిగా ఉంటుంది. ఇక వేసవి వచ్చిందంటే కూలర్లు, ఏసీల వాడకం పెరుగుతుంది. ఎండల వేడి భరించలేక చాలా మంది కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. ఇక వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగం, కొనుగోలు భారీగా పెరుగుతుంది. అయితే ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారు ఓ పది విషయాలను మైండ్‌లో పెట్టుకోవాలని అంటున్నారు నిపుణులు. మరి వారు చెప్పే ఆ సూచనలు ఏవి అంటే..
1. ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో రకరకాల కంపెనీలకు చెందిన ఏసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏసీ కొనే ముందు.. అది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు.. పెద్ద గదుల్లోనా.. లేక చిన్న రూమ్ కోసం ఏసీ తీసుకోవాలనుకుంటున్నారా అన్నది డిసైడ్ అయిన తర్వాత దానికి తగ్గట్లుగా ఏసీని సెలక్ట్ చేసుకోవాలి.
2. ఏసీ కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఎంత బడ్జెట్ కెటాయించాలనుకుంటున్నారో ముందే ఓ అంచనాకు రండి. ఇక మీ బడ్జెట్‌కు తగ్గ రేంజ్‌లో ఏసీ సెలక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ప్రస్తుతం కనీసం 30 వేలు పెట్టంది ఏసీ రావడం లేదు.
3. ఈఎంఐలలో కొనాలనుకుంటున్నారా.. లేక ఒకేసారి మొత్తం క్యాష్ చెల్లించాలనుకుంటున్నారా.. ముందే ఆలోచించుకొండి. ప్రస్తుతం చాలా మంది డీలర్లు.. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను అందిస్తున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్స్ 6-12 నెలల వరకు ఉంటాయి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా తీసుకొండి.
4. ఏసీ కొనాలనుకుంటే ముందుగా ఆయా కంపెనీల ఏసీల ధరలకు సంబంధించి ఓసారి ఆన్‌లైన్‌లో వాటి ధరలు చెక్ చేయండి. ఒకవేల మీరు కొనాలనుకున్న ఏసీ ధర ఆన్‌లైన్‌లో తక్కువ ఉంటే.. సేల్స్‌పర్సన్‌కు దాని గురించి చెప్పండి. అప్పుడు మీకు అదే ధరకు లేదా బెటర్ డీల్ లభించే అవకాశం ఉంది.
5. ఏసీ కొనేముందు దాన్ని ఎక్కడ ఫిట్ చేయించాలనుకుంటున్నారు అనే దాని గురించి మీకు ముందే ఓ అంచానా ఉండాలి. పెద్ద హాల్‌కి 1 టన్ ఏసీ సరిపోదు.. చిన్న రూమ్‌కి 2 టన్ ఏసీ అయితే మరీ చల్లగా ఉంటుంది. రూమ్ సైజ్‌ను బట్టి ఏసీని సెలక్ట్ చేసుకోవాలి. 1 టన్ ఏసీ 100, 120 చదరపు గజాల రూమ్‌కి సరిపోతుంది. అంతకన్నా పెద్ద గది అయితే 1.5 లేదా 2 టన్ యూనిట్ తీసుకోవాలి.
6. ఏసీ కొనేముందు.. మీ ఫ్లోర్ గురించి కూడా ఆలోచించాలి. మీరు అపార్ట్‌మెంట్‌లో పైన ఉంటున్నారు అనుకొండి.. వేసవి తీవ్రత మీ ఇంటి మీదనే ఎక్కువ ఉంటుంది కనుక మీరు పెద్ద, పవర్ ఫుల్ ఏసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
7. స్ప్లిట్, విండో ఏసీ.. ఈ రెండింటికి పెద్దగా తేడా ఉండదు. స్ప్లిట్‌తో పోలిస్తే విండో ఏసీ ధర కాస్త తక్కువగా ఉంటుంది. స్ప్లిట్ ఏసీని ఎక్కడైనా ఫిట్ చేయవచ్చు. కానీ విండో ఏసీ తీసుకుంటే.. దానికి తగ్గ సైజ్ కిటికి ఉండటం తప్పనిసరి. అలానే పవర్ సేవింగ్, కూలింగ్ టైమ్, శబ్దం వంటి వాటిల్లో రెండింటికి తేడాలుంటాయి. విండో ఏసీ అయితే పవర్ సేవింగ్ ఎక్కువగా ఉంటుంది. స్ప్లిట్ ఏసీలో అయితే శబ్దం తక్కువగా ఉంటుంది.. త్వరగా కూల్ అవుతుంది. మీ రూమ్ కెపాసిటీ, బడ్జెట్‌ని బట్టి ఏది కావాలో ఎంచుకొండి.
8. ఏసీ కొనేటప్పుడు చాలా మంది మర్చిపోయే అంశం కాయిల్ గురించి ప్రశ్నించడం. మీరు కొనాలునుకున్న ఏసీలో ఏ కాయిల్ వినియోగించారో అడిగి తెలుసుకొండి. అల్యుమినియం కాయిల్‌తో పోలిస్తే.. కాపర్ కాయిల్ అయితే నిర్వహణ, రిపేర్ చేయించడం సులభం. త్వరగా చల్ల బరుస్తుంది.
9. ఏసీ కొనేటప్పుడు మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం స్టార్స్. పవర్ సేవింగ్స్ తక్కువ ఉన్న ఏసీలకు ధర కూడా తక్కువే ఉంటుంది. కాకపోతే కరెంట్ బిల్లు భారీగా వస్తుంది. పవర్ సేవింగ్స్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీకి ధర ఎక్కువగా ఉంటుంది. కానీ అది తక్కువ కరెంట్ వాడుకుంటుంది. బిల్లు కూడా తక్కువే వస్తుంది. ఏసీ కొనేటప్పుడు ఈ స్టార్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
10. ఏసీ కొనగానే అయిపోదు. తర్వాత సర్వీసులు అందించే విషయంలో డీలర్ ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నాడు అనేది తెలుసుకోవడం కూడా కీలకం. ప్రతి నెలా సర్వీసింగ్ చేయించాలి.. మధ్యమధ్యలో రిపేర్లు వస్తుంటాయి. మరి వీటికి ఎలాంటి సర్వీసులు కల్పిస్తారో ముందుగానే తెలుసుకోవాలి. ఎన్ని రోజుల సమయం తీసుకుంటారు అనే విషయం కూడా తెలుసుకోవడం ముఖ్యం. కొన్న తర్వాత సేవల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏసీ కొనండి.
11. ఇక మార్కెట్లో పలు కంపెనీలు తమ బ్రాండ్ సేల్స్ పెంచుకోవడం కోసం రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శిస్తాయి. వాటిని చూసి మోసపోకండి. వైఫై ద్వారా కంట్రోల్ చేయడం… కూల్ పెంచడం కోసం ఇలా చేయండి అంటూ రకరకాల మాటలు చెబుతారు. కానీ అవన్ని అంత ముఖ్యం కాదు. ఏసీ కొనేటప్పుడు వీటి గురించి కాకుండా డ్యూరబిలిటీ, పవర్ సేవింగ్, కూలింగ్, కొన్న తర్వత లభించే సేవలు.. ఇవన్ని ఏది బెస్ట్‌గా ఉందో ఆ ఏసీని సెలక్ట్ చేసుకొండి.
ఈ జాగ్రత్తలు పాటించి.. మంచి ఏసీని కొనుగోలు చేసి.. ఈ వేసవిలో ఏసీ రూమ్‌లో చల్లగా సేదదీరండి. మరి నిపుణుల సలహాలు మీకు ఉపయోగపడ్డాయా లేదా.. దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.