1983 అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తొచ్చేది కపిల్ డెవిల్స్ గెలిచిన వరల్డ్ కప్. ఆ మధుర క్షణాలను, తొలి సారి విశ్వవిజేతగా నిలిచి ఉద్విగ్న క్షణాలు ఎవరు మాత్రం మర్చిపోతారు. ఆ విజయం ఇండియన్ క్రికెట్‌లో స్వర్ణాక్షరాలతో లిఖించిదగిన గొప్ప ఘట్టం. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోని క్రికెట్ మక్కా లార్డ్స్‌లో సాధించిన విజయం ఎప్పటికీ ఓ మరుపురాని మధుర జ్ఙాపకమే. పైగా గెలిచింది ఎవరిపై.. వెస్టిండీస్. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అరివీర భయంకరమైన జట్టు. క్రికెట్ రాజ్యానికి కరేబియన్ వీరులే రారాజులు. ఆ జట్టును ఓడించడం పక్కనపెడితే.. తలపడేందుకు కూడా చాలా మంది క్రికెటర్లు వణికిపోయే రోజుల్లో.. కపిల్ డెవిల్స్ వారిపై ఏకంగా వరల్డ్ కప్ గెలిచింది. అంతకు ముందు జరిగిన రెండు వరల్డ్ కప్స్‌లోనూ విజేత విండీస్ టీమే. అలాంటి జట్టును ఫైనల్లో మట్టికరిపించి కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా సాధించిన విజయం.. అద్భుతం. కాదు.. కాదు.. అంతకంటే ఎక్కువే మనకు.
ఈ అద్భుత విజయాన్ని గుర్తుంచుకోవటం పెద్ద విశేషమేమి కాదు. కానీ.. ఆ వరల్డ్ కప్ విజయం తర్వాత.. సరిగ్గా నాలుగు నెలలకే వెస్టిండీస్ మనపై తీర్చుకున్న ప్రతీకారం మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు. 1983 జూన్ 25న విశ్వవిజేతగా నిలిచిన కపిల్ డెవిల్స్‌కు ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం పట్టారు. ఇండియాలో ప్రజలు వారికి నీరాజనాలు పలికారు. అప్పటి వరకు క్రికెటర్లుగా ఉన్న వాళ్లు స్టార్లుగా మారిపోయారు. ఈ ఆనందం వారికి పట్టుమని 15 వారాలు కూడా నిలవలేదు. జూన్‌లో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత.. వెస్టిండీస్ జట్టు ప్రతీకారంతో రగిలిపోతూ.. 5 వన్డేలు, 6 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అక్టోబర్‌లో భారత గడ్డపై అడుగుపెట్టింది.
అప్పటికే వెస్టిండీస్‌ను వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడగొట్టిన కపిల్ సేన కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. పైగా సిరీస్‌లు జరిగేది మన పిచ్‌లపై కావడంతో వెస్టిండీస్ అంటే గతంలో ఉండే భయం.. అంతగా కనిపించలేదు. వరల్డ్ కప్ విజయం ఇచ్చిన జోష్ కపిల్ డెవిల్స్‌లో స్పష్టంగా కనిపించింది. టీమిండియాలో కనిపించిన ఈ ధైర్యమే విండీస్ వీరుల్లో మరింత కసి పెంచింది. క్రికెట్ సామ్రాజ్యాన్ని కొన్ని ఏళ్లుగా ఏలుతున్న తమను.. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఓడించిన టీమిండియాపై పీకలదాక కోసంతో ఉన్న కరేబియన్లు.. ఆ కోపాన్ని ఆటలో చూపించారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో వచ్చిన కసిని తీర్చుకుంటున్నారా? అనేంతలా కపిల్ డెవిల్స్‌పై చెలరేగిపోయారు.
వెస్టిండీస్ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్, దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, అప్పటి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ భారత బౌలర్ల భరతం పట్టారు. అప్పటికే క్రికెట్ ప్రపంచంలో స్టార్ క్రికెటర్లుగా, దిగ్గజాలుగా ఉన్న ఈ ఆటగాళ్లు మరింత కసితో ఆడారు. క్రికెట్‌లో వెస్టిండీస్ ఏకఛత్రాధిపత్యాన్ని ఒక్క గెలుపుతో లాక్కున్న కపిల్ డెవిల్స్‌కు తమ సత్తా ఇదీ.. అన్నట్లు ఆడి చూపించారు. బౌలింగ్‌లో మాల్కం మార్షల్ , ఆండీ రాబర్ట్స్ చెలరేగి టీమిండియా బ్యాటర్లకు సొంత పిచ్‌లపైనే చుక్కలు చూపించారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై పేస్ బౌలింగ్‌తో దడ.. దడ పుట్టించారు. అప్పటి వరకు వరల్డ్ కప్ విజయం మత్తులో ఉన్న కపిల్ సేన.. పరువు కోసం ఒక్క గెలుపు అయినా చాలు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చింది.
అప్పటి రోజుల్లో వెస్టిండీస్ జట్టు.. టీమిండియాను ఓడించడం అంత గొప్ప విషయమేమీ కాదు. ఎందుకంటే అప్పటికే వెస్టిండీస్ ఒక ఛాంపియన్ టీమ్. కానీ.. ఈ సిరీస్ కంటే నాలుగు నెలల ముందే కపిల్ డెవిల్స్.. వెస్టిండీస్‌ను ఫైనల్లో ఓడించి వరల్డ్‌కప్ గెలవడంతో.. టీమిండియాపై అంచనాలు పెరిగాయి. పైగా సిరీస్ మన దేశంలో జరగడం భారత్‌కు కొంత అడ్వాటేజ్‌గా మారింది. కానీ.. ఇవన్ని విండీస్ కసి ముందు నిలువలేకపోయాయి. 5 వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి వెస్టిండీస్.. 6 టెస్టుల సిరీస్‌ను 3-0తో గెలిచింది. ఆ మూడు టెస్టులను కూడా కపిల్ సేన ముక్కిమూలిగి డ్రా చేసుకోగలిగింది. బ్యాటింగ్‌లో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.. బౌలింగ్‌లో కపిల్ దేవ్ పర్వాలేదనిపించారు.
వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యులు ఎక్కువ కాలం టీమ్‌లో కొనసాగలేకపోవడానికి ఈ సిరీస్ ప్రధాన కారణంగా క్రికెట్ నిపుణులు భావిస్తారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు.. నాలుగు నెలలకే ఇలా చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో.. జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి రోజుల్లో క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ పరిస్థితి.. ఇప్పుడు మాత్రం గతమెంతో ఘనం అన్న రితీలో మారింది. వరుసగా రెండు వన్డే వరల్డ్ కప్‌లను గెలిచిన జట్టు.. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బ్యాటర్లు, బౌలర్లు ఉన్న జట్టు.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయర్లు ఆడాల్సి రావడమే దరిద్రం అనుకుంటే.. క్వాలిఫైయర్లలో ఐర్లాండ్ లాంటి జట్టుపై ఓడి.. వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్ర్కమించి అథపాతాళానికి పడిపోయింది. అదే సమయంలో.. ప్రస్తుతం టీమిండియా ఆటపరంగా, ఆర్థికంగా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా అంటే ఒక ఎదురులేని శక్తి.
1983 :: Group Photo of Teams In Cricket World Cup pic.twitter.com/VRXhBighDx
— indianhistorypics (@IndiaHistorypic) September 11, 2022
The start of something special … Gordon Greenidge is bowled by Balwinder Sandhu for 1 at the start of West Indies’ innings in the 1983 World Cup final. Sandhu only took 16 ODI wickets but his two in the final were priceless for India pic.twitter.com/TjMZBTerPV
— Historic Cricket Pictures (@PictureSporting) October 21, 2022
The first team to win the
Cricket World Cup 1983.
Champions of the world#IndiaAt75#15August pic.twitter.com/XXF0QuOck7— Kirti Azad (@KirtiAzaad) August 15, 2022