కరోనా కల్లోలం ఇండియన్ క్రికెట్ ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మొన్నటికి మొన్న కరోనా బారిన పడ్డాడు. అయితే.., పంత్ పూర్తిగా కోలుకునట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించిన ఒక్క రోజు గ్యాప్ లోనే.. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఇండియా యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆ టీమ్ లో కీలక సభ్యుడు, స్టార్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ గా తేలింది.
నిజానికి మరికాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అనగా ఈ టెస్ట్ లు నిర్వహించారు. అయితే.., ఇందులో కృనాల్ కి పాజిటివ్ రావడంతో ఈ మంగళవారం శ్రీలంకతో జరగాల్సిన రెండో టీ-20 మ్యాచ్ ని రేపటికి వాయిదా వేశారు. ఒకవేళ తరువాత నిర్వహించే టెస్ట్ లలో ఇరు జట్ల ఆటగాళ్లు అందరికీ నెగిటివ్ వస్తే.. రేపు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే మాత్రం సీరీస్ ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు తరువాత ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా కృనాల్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.