క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్.. టీమిండియా ఎంట్రీ కోసం సీనియస్‌గ్రా ట్రై చేస్తున్నాడు.
ఈ సీజన్‌లోనే తొలిసారి ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్.. ఇక భారత జట్టు తలుపు తట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఉపయుక్తమైన పేస్ బౌలింగ్ తో పాటు.. లోయర్ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల ఈ లెఫ్ట్ హ్యాండర్ గత సీజన్‌లో రంజీ ట్రోఫీలో సెంచరీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న విషయం తెలిసిందే. చిన్నతనం నుంచే తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న అర్జున్ టెండూల్కర్.. రోజు రోజుకు మెరుగవుతూ ముందుకు సాగుతున్నాడు. మూడేళ్లుగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కొనసాగుతున్న అర్జున్.. అక్కడ అంతర్జాతీయ స్థాయి ప్లేయర్ల సహవాసంతో మరింత రాటుదేలాడు.
భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. ఆటతో పాటు ఆహార్యం ముఖ్యమని తేలండంతో.. అర్జున్ ఇప్పుడు ఆ వైపుగా దృష్టి సారించాడు. గతంలో కాస్త చబ్బిగా కనిపించిన అర్జున్.. ప్రస్తుతం సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. జిమ్ సెషన్ అనంతరం అద్దంలో అర్జున్ తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ సృష్టిస్తోంది. తన యాబ్స్‌తో ఫిట్‌నెస్ లెవల్స్ మెరుగ్గా ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా దేవధర్ ట్రోఫీలో ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా భారత జట్టు ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. కేవలం తమ ఆహార్యం సరిగ్గాలేకనే కొందరు ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు కోల్పోయారనడంలో అతిశయోక్తి లేదు. ట్యాలెంటెడ్ ఓపెనర్‌గా మన్ననలందుకున్న ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. కెరీర్ తొలినాళ్లలో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత అతడి ఫిట్‌నెస్ లెవల్స్ అంతర్జాతీయ స్థాయిలో లేవనే కారణంతోనే అవకాశాలు దక్కలేదు. ఇక ముంబైకే చెందిన మరో బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్‌ను కనీసం వెస్టిండీస్ టూర్‌కైనా ఎంపిక చేయాల్సిందనే వాదనలు వినిపించగా.. ఆ సమయంలో సర్ఫరాజ్ ఫిట్‌నెస్ అంశంపై ప్రధాన చర్చ జరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ట్యాలెంట్‌తో పాటు అందుకు తగ్గ ఫిట్‌నెస్ ఉండాల్సిందే అని గతంలో విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్.. ఇలా వీళ్లంతా ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేశారు. ఇప్పుడు వీరి బాటలోనే 23 ఏళ్ల అర్జున్ కూడా సిక్స్ ప్యాక్‌తో మెరుస్తున్నాడు. మరి అర్జున్ టెండూల్కర్ టీమిండియా అరంగేట్రం ఎపుడు చేస్తాడో చూడాలి!