ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మైండ్ గేమ్ వర్కౌట్ అయ్యింది. అసెంబ్లీలో బలం లేకపోయినా.. అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించింది.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గెలవడానికి అసెంబ్లీలో బలం లేకపోయినా.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. గెలవాలంటే 22 ఓట్లు అవసరం కాగా, ఏకంగా 23 ఓట్లు సాధించి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించింది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం ముందు నుంచి అలవాటు. వైసీపీకి చెందిన పలువురు అసమ్మతి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చెప్తూనే ఉన్నారు. చివరకి వారు చెప్పినట్లే ఫలితం వెలుబడింది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆమె గెలుపు లాంఛనమే అయినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు ఎన్నికల అనంతరం అధికార వైసీపీకి జై కొట్టారు. ఈ లెక్కన టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే. ఒకవేళ అధికార వైసీపీపై అసమ్మతి గళం వినిపించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం.. టీడీపీకి ఓటు వేసినా.. అప్పుడు పార్టీ బలం 21కి చేరాలి. కానీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు పోలైనట్లు వార్తలొస్తున్నాయి. దీంతో వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఓటింగ్‌కు ముందు 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెప్పిన సంగతి అందరికీ విదితమే. అంతమంది టీడీపీ వైపు మొగ్గుచూపకపోయినా.. రెబెల్స్ కాకుండా మరో ఇద్దరు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారన్నది వాస్తవం.