దేశ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను నిర్వహిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నాడిని, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్రను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను తెలుసుకుంటూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ప్రణాళికలను ఇప్పటినుంచే రూపొందించుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఎప్పుడూ విమర్శలకు దిగే రాహుల్.. మరోమారు సంఘ్ మీద నిప్పులు చెరిగారు.
ఈ 21వ శతాబ్దంలో కౌరవులు ఖాకీ లాగులు తొడుక్కుని, చేతిలో లాఠీతో తిరుగుతున్నారంటూ సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ఆరోపించారు. శాఖల పేరుతో వాళ్లు సమావేశాలు నిర్వహిస్తుంటారని.. దేశంలోని ముగ్గురు బిలియనీర్లు ఈ కౌరవులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం జోడో యాత్ర హరియాణాలోని అంబాలా జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాండవులంటే కాంగ్రెస్.. కౌరవులంటే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేశారు.
‘పాండవుల పాలన ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఈ నేలపై ద్వేషాన్ని వ్యాపింపజేసే పనులను పాండవులు అసహ్యించుకునేవారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ లాంటి పనులను వాళ్లు ఎన్నడూ చేయలేదు. ఇలాంటి వాటి వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని తెలుసు కాబట్టే పాండవులు ఈ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం రైతన్నలకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా వ్యవసాయ చట్టాలపై సంతకాలు చేశారు’ అని రాహుల్ విమర్శించారు.
అగ్రి చట్టాల తయారీ వెనుక మోడీ బిలియనీర్ మిత్రులు ఉన్నారని, వాళ్లే ఆయనతో సంతకాలు చేయించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ అప్పుడు కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లే.. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఖాకీ లాగులు తొడుక్కుని తిరుగుతున్న కౌరవులకు, అన్ని వర్గాల ప్రజలకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఖాకీ లాగులతో తిరుగుతున్న కౌరవులుగా పోల్చిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.