తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో టీడీపీ కీలక నేత అయిన గంజి చిరంజీవి సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎం కార్యాలయానికి వెళ్లిన చిరంజీవి.. జగన్ సమక్షంలో పార్టీలో చేరి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్‌కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరలు పాల్గొన్నారు. ఇక కొన్నాళ్ల నుంచి టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గంజి చిరంజీవి.. కొన్ని రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇక వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని.. సంక్షేమ కార్యక్రమాలతో పాటూ వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ పదవులతో పాటూ రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంది జగన్ ఒక్కరేనని గంజి చిరంజీవి స్పష్టం చేశారు.
ఇక రాజీనామా అనంతరం చిరంజీవి టీడీపీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని నమ్మి తాను టీడీపీలో జాయిన్ అయ్యానని.. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం.. టీడీపీలో బీసీలకు స్థానం లేదని ఆరోపణులు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని.. కానీ టీడీపీలోని కొందరు నాయకులు తనను రాజకీయంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
గంజి చిరంజీవి ప్రస్తుతం నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉండేవారు. 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ హయాంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2019లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ నారా లోకేష్ 2019లో మంగళగిరి నియోజకవర్గం ఎంచుకోవడంతో గంజి చిరంజీవికి సీటు దక్కలేదు. అయినప్పటికి ఆయన టీడీపీలోనే కొనసాగడమే కాక.. లోకేష్‌కు అనుచరుడిగా ఉన్నారు. ఇక తాజాగా వైసీపీలో చేరారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.