రాజధాని అమరావతిలో పేదల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. ఇవాళ పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి తొలి ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందించారు.
సొంతింటి కల అనేది ఎంతోమంది కల. ఈ కల కనేవారిలో పేదవారు సైతం ఉంటారు. ఎక్కడైనా కొంచెం స్థలం ఉంటే చాలనుకునే వారికి ఏకంగా రాజధానిలోనే స్థలాన్ని ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అమరావతి మనందరిదీ అనే నినాదంతో పేదల సొంతింటి కలను నిజం చేశారు. వైఎస్ జగన్ ఇవాళ అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించిన ఆయన.. సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు భూమి పూజ చేసి తొలి ఇంటి పట్టాలను అందించారు. ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే రోజని.. రాజధాని నడిబొడ్డున పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని అన్నారు.
ఇప్పటి వరకూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ. 1370 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఒక్కో లబ్ధిదారునికి రూ. 2,70,000 పెట్టి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలను ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇల్లు పూర్తయ్యే సరికి ఆ ఇంటి విలువ 12 లక్షల నుంచి 15 లక్షలు పలుకుతుందని అన్నారు. రాజధానిలో గజం ఇవాళ రూ. 15 వేలు ఉందని.. ఏడున్నర లక్షల రూపాయలు విలువ చేసే విలువైన స్థలాన్ని పేదలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు ఎప్పటికీ మరచిపోలేని రోజు అని.. పేదల కోసం వచ్చిన నాయకుడు మా జగన్ అని అంటున్నారు.
ఈ విషయంలో జగన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే పేద ప్రజలు ఉన్న బస్తీలను ఖాళీ చేయించి కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టి వ్యాపారం చేసే కార్పొరేట్ వ్యక్తులు ఉన్న ఈరోజుల్లో.. రాజధాని నడిబొడ్డున పేదల కోసం స్థలం ఇచ్చి.. ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. అవే స్థలాలను కమర్షియల్ పర్పస్ కోసం వాడుకునే అవకాశం ఉంది. అయినా కూడా అలా చేయకుండా పేదల కోసం ఆలోచించారంటే అందుకు సీఎం జగన్ ని మెచ్చుకోవాలి.