రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో.. నష్టాన్ని మిగిల్చాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. ఈ భారీ వర్షాల వల్ల భద్రాచలంలో ఎంతటి ప్రమాదం సంభవించిందో ప్రత్యక్షంగా చూశాం. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంతటి భారీ వరద వచ్చిందని అధికారులు వెల్లడించారు. అటు ఏపీలో కూడా వరద ప్రభావం భారీగానే ఉంది. చాలా లంక గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో భారీ వరదల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. పోలవరం ప్రాజెక్ట్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ వివరాలు..
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచాలనికి ముప్పు పొంచి ఉందని ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని.. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. అంతేకాక విలీన మండలాలను తెలంగాణలో కలపాలి అన్నారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలోలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా అని బొత్స ప్రశ్నించారు. పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు విషయం ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించారన్నారు.
‘‘పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు.. డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు కదా. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అందువల్ల హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగ్గలమా.. గతంలోలా ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని అడిగితే బావుంటుందా.. అలా అయితే చేసేయమనండి. ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి.. మాకు అభ్యంతరం లేదు. సాంకేతికంగా ఇబ్బందులొస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి తప్ప.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు’’ అన్నారు.
‘‘పువ్వాడ అజయ్ అతడి సంగతి చూసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాలు, ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబసభ్యులు. ఆ ప్రజల బాధ్యత పూర్తిగా మాది. విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని వాళ్లు అంటే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం కూడా డిమాండ్ చేస్తాం’’ అని బొత్స వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.