కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అందరికి సహాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతు అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నారు. ఆపద సమయంలో అండగా ఉంటూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతు ముందుకు సాగుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం జగన్. వరద పరిస్థితులపై, అందుతున్న సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత బాధితులతో మాట్లాడారు. బాధితులందరికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని సీఎం జగన్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ. 10వేలు, ఇళ్లలోకి నీరు చేరిన వారికి రూ. 2 వేలు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కంటె ముందే వారికి పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కూనవరంలో పర్యటించిన సీఎం జగన్ పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడుతు.. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే పోలవరం నిర్వాసితులకు మొదటి దశ పరిహారం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. నేరుగా నిర్వాసితుల అకౌంట్లలోకి పరిహారం జమ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఆరు, ఏడు నెల్ల వ్యవధిలోనే పరిహారం అందేలా చర్యలు చేపడతామని అన్నారు. కేంద్రం ఇచ్చే పరిహారం 6.8 లక్షలకు, రాష్ట్రం వాటా 3.2 లక్షలు కూడా కలిపి అందిస్తామని తెలిపారు. పోలవరం రెండు, మూడు దశల్లో కూడా ఇదే రకంగా పరిహారం పూర్తి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర క్యాబినెట్ పోలవరం మొదటి దశ పరిహారానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మీ జగన్ కు కల్మషం లేదు, మీకు మంచి చేయడం కోసమే ఆరాట పడుతానని, అందరికీ మేలు జరగాలన్నదే తన ధ్యేయమని సీఎం జగన్ స్పష్టం చేశారు.