కర్ణాటక- కన్నడ పవర్ స్టార్, అప్పూ గా అభిమానుల గుండెల్లో నిండిపోయిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. బెంగళూరు నగర శివారులోని కంఠీరవ స్టూడియోస్ లో పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయనను సమాధి చేశారు. అంతకు ముందు జరిగిన పునీత్ రాజ్ కుమార్ అంతిమాత్రలో వేలాది మంది అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండు రోజులుగా సినీ, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడికి ఘన నివాళులర్పించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకాగేరీ, మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, ఎస్‌ఎం కృష్ణ, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజే తదితరులు పునీత్‌కు నివాళులర్పించారు.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, రానా, శ్రీకాంత్ తదితరులు పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి పెద్దకుమార్తె ధృతి శనివారం సాయంత్రం బెంగళూరుకు చేరుకుంది. తండ్రి పార్థివదేహంపై పడి రోదించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. పునీత్ రాజ్‌కుమార్ కు కొడుకులు లేకపోవడంతో అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ ఈడిగ అంత్యక్రియలు నిర్వహించారు.
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇకలేరన్న చేదు నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణవార్త విని ఇద్దరు ఫ్యాన్స్ చనిపోయారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఇపునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని అథణి తాలూకాలో 26 ఏళ్ల రాహుల్ గాడివడ్డర అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో పునీత్ రాజ్‌కుమార్ ఫోచోకు శనివారం ఉదయం పూజలు చేసిన రాహూల్, ఆ తర్వాత ఇంటికెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదే జిల్లా శిందొళ్లిహళ్లి కనకదాసా కాలనీ వాసి 33 ఏళ్ల పరుశరామ హనుమంత దేమణ్ణవర, పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురై చనిపోయాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, అధి ఆయన ఆత్మకు క్షోభిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అభిమానులకు విజ్ఞప్తి చేశారు.