స్పోర్ట్స్ డెస్క్- టీం ఇండియా మరోసారి తన సత్తా చాటుకుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. న్యూజిలాండ్ పై అద్భుత విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీం ఇండియా 124 పాయింట్లతో కివీస్ ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఇక రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ రెండో ర్యాంకుతో సరిపెట్టుకుంది. టీం ఇండియా 124 పాయింట్లు, కివీస్ జట్టు 121 పాయింట్ల తరువాత ఆస్ట్రేలియా జట్టు 108 పాయింట్లు, ఇంగ్లండ్ జట్టు 107 పాయింట్లు, పాకిస్తాన్ జట్టు 92 పాయింట్లతో టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీం ఇండియా రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. కాన్పూర్ లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగియగా, ముంబై టెస్టులో మాత్రం కోహ్లి సేన కనీవినీ ఎరుగని విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ జట్టు ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టీం ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.
దీని ద్వార డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక మొట్టమొదటి డబ్ల్యూటీసీ విజేత కివీస్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా ఓటమి ఎదురైంది. మొత్తానికి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.