ఆసియా కప్ కోసం నిన్న సెలక్ట్ చేసిన జట్టులో సంజు శాంసన్ కి రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కింది. అయితే 17 మంది ప్రాబబుల్స్ లో సెలక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా శాంసన్ కి నిరాశ మాత్రం తప్పలేదు.
ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవరం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఈ జట్టుని ఖరారు చేశారు. ఈ మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు .. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొన్నాడు. 17 మందిని సెలక్ట్ చేసిన ఈ స్క్వాడ్ లో తొలిసారి తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కి మాత్రం సెలక్టర్లు మరోసారి తీరని అన్యాయం చేసినట్టుగానే కనిపిస్తుంది. కొత్త సెలక్టర్ వచ్చినా సంజు తలరాత మాత్రం మారలేదు. జట్టులో నుంచి తీసేయలేక ఏదో కష్టంగా అంటిపెట్టుకున్నట్లుగా ఉంది ఈ కేరళ స్టార్ ఆటగాడి పరిస్థితి. సరిగ్గా ఆలోచిస్తే సంజు శాంసన్ కి ఆసియా కప్ ప్రధాన జాబితాలో చోటు దక్కడానికి చాలానే అర్హతలు ఉన్నాయి.
ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కోసం నానా తంటాలు పడుతుంది. రోడ్డు ప్రమాదంలో పంత్ కి యాక్సిడెంట్, తాత్కాలిక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో సంజు శాంసన్ కి ఆసియా కప్ లో చోటు గ్యారంటీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నిన్న ప్రకటించిన 17 మంది ప్రాబబుల్స్ లో శాంసన్ కి చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే క్రమంలో ఒక్క వన్డే అనుభవం లేని తెలుగు కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. ఫామ్ లో ఉన్న తిలక్ ని ఎంపిక చేయడం తెలుగు అభిమానులకి సంతోషం కలిగించినా..టీమిండియాకు ఇప్పుడు తిలక్ వర్మ కంటే శాంసన్ అవసరమే ఎక్కువగా ఉంది. వికెట్ల వెనుక కీపింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్ లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా శాంసన్ సొంతం.
మన సెలక్టర్లు పూర్తి ఫిట్ నెస్ సాధించారో లేదో తెలియని శ్రేయాస్ అయ్యర్, రాహుల్ మీద నమ్మకముంచారు కానీ శాంసన్ ని మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాహుల్ ఆసియా కప్ కి సెలక్ట్ అయినా ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తుంది. తాజా సమాచార ప్రకారం ఆసియా కప్ లో తొలి మ్యాచ్ కి రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్ నెస్ లేని రాహుల్ ని ఎందుకు సెలక్ట్ చేసారో అర్ధం కావడం లేదు. పైగా రాహుల్ గత కొంతకాలంగా ఏమంత గొప్ప ఫామ్ లో కూడా లేడు. మరో వైపు అయ్యర్ నిలకడైన బ్యాటర్ అయినా వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ కాపాడుకుంటూ ఫామ్ లోకి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇక తిలక్ వర్మ విషయంలో సెలక్టర్లు కాస్త తొందరపడినట్లుగానే కనిపిస్తుంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ .. అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడిని అధిగమించగలడా? లేదా? అనే సందేహం కూడా లేకపోలేదు.
ఇషాన్ కిషాన్ రూపంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్నా మిడిల్ ఆర్డర్ లో ఆడిన అనుభవం కిషాన్ కి లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వన్డేల్లో పేలవ ఫామ్ లో ఉన్నా సూర్య కుమార్ యాదవ్ కి కూడా ఆసియా కప్ లో ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఎలా చూసుకున్నా సంజు జట్టులో కావాలనే ఛాన్స్ ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సంజు శాంసన్ టీ 20 లో విఫలమైనా.. వన్డేల్లో మాత్రం ఎప్పటికప్పుడూ తనని తాను నిరూపించుకుంటూనే వస్తున్నాడు. ఇప్పటివరకు 13 వన్డేలు ఆడిన శాంసన్ 390 పరుగులు చేసాడు. యావరేజ్ 55 ఉండడం విశేషం. దక్షిణాఫ్రికా మీద గతేడాది లక్నో లో ఆడిన సంచలన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మ్యాచులో టీమిండియా ఓడిపోయినా 63 బంతుల్లోనే 86 పరుగులు చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొంటూ సహచరులు విఫలమైనా తాను మాత్రం ఒంటరి పోరాటం చేసాడు. అవకాశమిస్తే ఇలాంటి ఇన్నింగ్స్ లు ఆడటానికి సంజు శాంసన్ సిద్ధంగా ఉన్నాడు. మరి ఆసియా కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన సంజు శాంసన్ ని వరల్డ్ కప్ లోనైనా 15 మంది స్క్వాడ్ లో అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Tilak Varma & SKY ahead of #SanjuSamson ,this is how lobby works..!
Tilak’s score in last 2 innings 0 & 1. Lefty tax is’nt an excuse as Kishan is already there.
SKY in ODI :avg 24 after 26 matches.Sanju in ODI: 56 avg & 104 S/R, scored 50 in the last match with 125 S/R as no:4. pic.twitter.com/lbewhJ3myI
— Amal Sudhakaran (@amal_sachinism) August 21, 2023