హైదరాబాద్ క్రైం- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది.
హైదరాబాద్ సహా ప్రధాన హైవేల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సుమారు పదిహేను పోలీసులు టీంలు రాజు కోసం గాలిస్తున్నారు. నిందితుడు రాజు ఫొటోలను ప్రింట్ చేయించి ఆటోలు, బస్సులకు అంటిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసు నంబర్లకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. నగరంలోనూ ఫుట్‌పాత్‌లు, వైన్‌షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బస్టాండ్లు తదితర ప్రదేశాల్లో రాజు కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వాహనదారులకు ఫొటోలు చూపిస్తూ ఆచూకీ తెలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
చిన్నారిపై అత్యాచారం చేసి. పారిపోయే సమయంలో బాగా జుట్టు పెంచుకుని ఉన్న నిందితుడు, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గుండు చేయించుకునే అవకాశం కూడా ఉందని, గుండుతో ఉంటే ఎలా ఉంటాడనే నమూనా ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తూ ఉప్పల్‌లో ఓ వైన్‌షాపు వద్ద ఆగినట్లు సీసీటీవీలో రికార్డైనట్లు తెలుస్తోంది. అక్కడే తన చేతిలోని ఓ కవర్‌ను పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈక్రమంలో రాజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగుతూ కనిపించినట్లు ప్రచారం అవుతోంది. విజయవాడ హైవేలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సీసీటీవీ రికార్డైందని, నిందితుడు రాజు మాదిరిగానే ఉన్నాడని స్థానికులు కొందరు చెబుతున్నారు. నిందితుడు రాజు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో తిరుగుతున్నాడని ఓ నెటిజన్ ఫొటోను ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి నిందితుడు రాజులానే ఉండటంతో అతనే కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఐతే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు.
Sir take a look at this @hydcitypolice he is roaming in nalgonda take immediate action on him 😬#JusticeForChaithra pic.twitter.com/LkmBQBFCPe
— 🅰️karsh y🅰️dav🪓 (@akarsh_26) September 15, 2021