బిజినెస్ డెస్క్- భారత్ లో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. గత వారంలో వరుసగా నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు శని, ఆదివారాలు కాస్త విరామం ఇచ్చాయి. మళ్లీ నిన్నటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. సోమవారం పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్‌పై 33 పైసల చొప్పున పెంచాయి. తాజాగా ఈ రోజు మంగళవారం మళ్లీ పెట్రోల్ పై 27 పైసలు, డీజిల్ పై 20 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 91.80కు, డీజిల్ ధర రూ.82.36 కు చేరాయి.
ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.98.12, డీజిల్ రూ.89.48, చెన్నైలో పెట్రోల్ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20కు పెరిగాయి. ఇఖ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.95.41, లీటరు డీజిల్ రూ.89.79 కి చేరింది. విజయవాడలో లీటరు పెట్రోల్ రూ.97.86,లీటరు డీజిల్ రూ.91.67 కు చేరింది. రోజువారీ సమీక్షలో భాగంగా ప్రతి రోజు ఉదయం 6 గంటలకు దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే చమురు ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయా రాష్ట్రాలను బట్టి స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంటుంది.