కేరళ- ఓనం.. దేవతల భూమి కేరళ ప్రజలకు ప్రత్యేక పండుగ. ప్రతి యేడాది ఆగస్ట్ నెల చివర్లో, సెప్టెంబర్ మాసం మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళ ప్రజలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సారి ఈ నెల 12న మొదలైన ఓనం వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో ముగుస్తుంది.
మొత్తం పది రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండులో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగు రంగుల పూల ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. ఓనం పండగలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కేరళ బాషలో దీనిని పూకోలం అంటారు. అంటే పూల ముగ్గు అని అర్ధం.
ఇక ఓనం పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ‘ఓనసద్యా’ అనే విందు కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది. గత వారం రోజులుగా కేరళ మగువలు ఓనం పండుగను వైభవంగా జరుపుకొంటున్నారు. ఓనమ్ అగోషం అంటే ఓనం వేడుకలు అంటూ సోషల్ మీడియాలో ఫొటోలతో మలయాళ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్, కీర్తి సురేశ్, కల్యాణి ప్రియదర్శిన్, మంజిమా మోహన్, మాళవిక మోహనన్, పూర్ణ, నివేధా ధామస్, మహిమ నంబియార్ తదితరులు సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలకు ఫోజిలిచ్చారు. ప్రముఖ సినీ నేపధ్య గాయని కె.ఎస్ చిత్ర ఓనమ్ సందర్భంగా ప్రత్యేకంగా పాడిన పాటలను యూట్యూబ్‌లో విడుదల చేయగా, అది బాగా వైరల్ అవుతోంది. మరి మనం కూడా కేరళ ప్రజలకు ఓనం పండగ శుభాకాంక్షలు చెబుదామా..