కరోనా ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా కారణంగా భారీగా దెబ్బ తిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కరోనాకు ముందు ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది.
గత రెండేళ్లలో బాక్సాఫీస్ ను పలకరించిన భారీ ప్రాజెక్ట్ లు రెండే రెండు. అవి బాలకృష్ణ అఖండ, బన్నీ పుష్ప. ఈ రెండు సినిమాల విడుదల, కలెక్షన్లు చూసిన పెద్ద చిత్రాల మేకర్స్.. సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపినప్పటికి వారి ఆశల మీద ఒమిక్రాన్ నీళ్లు చల్లింది. దేశవ్యాప్తంగా మరోసారి ఆంక్షలు విధించడంతో.. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాల విడుదల ఆగిపోయింది.
ఇది కూడా చదవండి : సినిమా టిక్కెట్ ధరలతో నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు
ఇక దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరస్ తో పాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా సినీ ఇండస్ట్రీని భయపెడుతున్నాయి. 70 శాతం మార్కెట్ తో టాలీవుడ్ కి ఆయువు పట్టుగా ఉన్న ఏపీలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తో పాటు టికెట్ల రేట్లను ప్రభుత్వమే నిర్ణయించడం, థియేటర్లపై దాడుల నేపథ్యంలో అసలు సినిమాలు రిలీజ్ చేయాలంటనే పరిశ్రమ వాళ్లు భయపడుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.
చిరంజీవి వంటి ఇండస్ట్రీ పెద్దలు గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ల ధరల విషయంపై మరోమారు ఆలోచించాల్సిందగా కోరడంతో ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ వేసినట్టు.. ఏపీ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ తెలిపారు. ఇప్టపికే పలు మార్లు సమావేశమైన ఈ కమిటీ కీలక సమావేశం ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. ఆ సమావేశంలో థియేటర్లను ఎలా వర్గీకరించాలి.. ఏ ప్రతిపాదికన టిక్కెట్ల ధరలను నిర్ణయించాలి అనే తదితర అంశాలను చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు.
ఇది కూడా చదవండి : ఏపీ సినిమా టికెట్స్ విషయంలో కీలక మలుపు! RGV వల్ల పరిష్కారం రాబోతోందా?
అయితే ఈ కమిటీ ఎంత నిర్ణయించినా.. తెలంగాణలో పెంచిన మాదిరిగా సినిమా టిక్కెట్ల రేట్లు ఏపీలో ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. వినోదం సామాన్యుడికి అందేలా ఉండాలని ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక టిక్కెట్ల ధరల విషయంలో ఇండస్ట్రీ ప్రజలకు పెద్దగా ఆశలు లేవు. పైగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభం అయి పది రోజులు కూడా కాలేదు.. కానీ కరోనా కేసులు మాత్రం వాయువేగంతో పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే పరిస్థితి ఉంది. అదే జరిగితే ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఆచార్యతో పాటు మిగతా పెద్ద సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఎక్కువ. టిక్కెట్ల రేట్లలో పెద్దగా పెంపు ఉండకపోవడమే కాక.. ఒమిక్రాన్ కలవరంతో ఫిబ్రవరిలో టాలీవుడ్ నెత్తిన మరో పిడుగు తప్పేలా లేదు.. ఇక దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి తప్పదేమో అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : పేదలపై ప్రేమ అంటే ఇదేనా.. ఆర్టీసీ టికెట్ల రేటు పెంపుపై నాదెండ్ల ఫైర్!