కరోనా చికిత్సకే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సకూ అంతకన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ప్రశాంతంగా ఉండటానికి లేని పరిస్థితులు. కొంతమంది ఆస్తులు అమ్మి మరీ బ్లాక్ ఫంగస్ కు చికిత్స్ చేయించుకుంటున్నారు. కానీ ఆ స్తోమత లేని వాళ్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈక్రమంలో కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ సోకిన ఓ వ్యక్తి ఏకంగా చికిత్స కోసం కోటి రూపాయలకు పైనే ఖర్చుపెట్టిన ఘటన జరిగింది. మహారాష్ట్రలోని విదర్భకు చెందిన నవీన్ పాల్ ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు చేసి చికిత్స పొందాడు. గత అక్టోబర్ లోనే తనలోని బ్లాక్ ఫంగస్ లక్షణాలను వైద్యులకు నవీన్ చెప్పాడు. కానీ, అప్పటికి అదే తొలి కేసు కావడం, దాని చికిత్సా పద్ధతులు తెలియకపోవడంతో అతడు తన ఎడమ కంటిని కోల్పోవాల్సి వచ్చింది.
దాదాపు ఆరు ఆసుపత్రుల్లో 13 శస్త్రచికిత్సల తర్వాత కోలుకున్నాడు. భార్య రైల్వే ఉద్యోగి కావడంతో చికిత్సకు అయిన ఖర్చుల్లో కోటి రూపాయలను రైల్వే శాఖ భరించింది. మిగతా రూ.48 లక్షలను అతడు సమీకరించుకున్నాడు. తన ప్రాణం దక్కుతుందంటే కన్ను పోయినా ఫర్వాలేదని డాక్టర్లకు చెప్పినట్టు నవీన్ తెలిపాడు. సెప్టెంబర్ లో తనకు కరోనా సోకిందని, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నానని, కొన్ని రోజులకు తగ్గిపోవడంతో ఇంటికొచ్చేశానని తెలిపాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే పన్ను, కన్ను బాగా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పాడు. ముంబై హాస్పిటల్ లో కేవలం కొన్ని రోజులకే హాస్పిటల్ బిల్లు రూ.20 లక్షలు వేశారు. దీంతో చేతిలో ఉన్న డబ్బు అంతా అయిపోవచ్చింది. ఇక అంత ఖర్చు భరించలేక మళ్లీ నాగ్ పూర్ వచ్చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే కన్ను బాగా ఇన్ ఫెక్ట్ అవ్వటంతో కన్ను తీసేయాల్సి వచ్చింది. నాగ్ పూర్ హాస్పిటల్ లోనే డాక్టర్లు కన్ను తీసేశారు. కన్ను పోయినా ప్రాణం దక్కినందుకు సంతోషంగానే ఉందన్నాడు.