ప్రభుత్వ ఆసుపత్రులన్న పేరుకే గానీ రోగులను పట్టించుకునే వారే ఉండరు. వైద్యం కోసం వెళ్లిన రోగిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ లేక కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. సరైన సదుపాయాలు ఉండవు, ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన సరిగా ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. చికిత్స సరిగా చేయకపోవడం, వైద్యులు విధులకు సరిగా హాజరు కాకపోవడం, డాక్టర్ చేయాల్సిన చికిత్స నర్స్ చేయడం ఇలా రకరకాల రోగాలతో ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులు ఇలాంటి రోగాల బారిన పడితే ఇక సామాన్యులను ఎలా పట్టించుకుంటారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఉన్న ఓ రోగిని బంధువులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే స్ట్రెచర్ అందుబాటులో లేదు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదు.
దీంతో బంధువులే రోగి కాళ్ళు పట్టుకుని వైద్యుడి దగ్గరకు లాక్కెళ్లారు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన సాయంత్రం సమయంలో జబ్బు బారిన పడ్డ ఓ వ్యక్తిని అతని బంధువులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ కోసం అడగగా.. మధ్యాహ్నం వరకే ఉందని అన్నారు. దీంతో ఆ రోగి రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండిపోయాడు. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తర్వాత రోగిని తీసుకొచ్చిన బంధువులు ఓపీ రిజిస్టర్ చేయించారు. రెండవ అంతస్తులో ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని ఓపీ రాసిచ్చారు. దేంతో రోగిని లిఫ్ట్ వరకూ స్ట్రెచర్ మీద తీసుకెళదామంటే అక్కడ స్ట్రెచర్ లేదు. సిబ్బంది ఎవరూ కూడా పట్టించుకోలేదు.
దీంతో రోగి బంధువులు అతని కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లాల్సిన దుస్థితి. రోగి కాళ్ళు పట్టుకుని లాగుతున్నా కూడా వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. లిఫ్ట్ వరకూ లాక్కెళ్లి రెండవ అంతస్తుకు చేరుకున్నారు. పోనీ అక్కడైనా స్ట్రెచర్ గానీ, వీల్ చైర్ గానీ ఉన్నాయా అంటే లేవు. లిఫ్ట్ నుంచి డాక్టర్ గదిలోకి రోగిని కాళ్ళు పట్టుకుని లాక్కెళ్లారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీల్ చైర్లు , స్ట్రెచర్లు లేకపోతే సంబంధిత అధికారులకు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.