అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యిందంటే.. సామాన్యులు.. అధికారులు, రాజకీయనాయకులు ఎలా పని చేయాలని ఆలోచిస్తారో.. తప్పు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారో.. వ్యవస్థలో ఏ మార్పులు రావాలని భావిస్తారో.. వాటన్నింటిని తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఆ సినిమా భారీ విజయం సాధించింది. మరి వాస్తవంగా ఇలా పని చేసే అధికారులుంటారా అంటే.. ఎందుకుండరు.. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి ప్రపంచానికి తెలుస్తుంటుంది. ఎందుకంటే.. వారికి పనే దైవం.. ప్రభుత్వం ఉద్యోగంలోకి వచ్చిందే ప్రజలకు సేవ చేయడం కోసం అని మనసా, వాచా, కర్మణా నమ్మడమే కాక ఆచరించి చూపుతారు. కనుకే.. ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావిస్తారు. మరి సినిమాల్లో చూపినట్లు.. నిజంగానే అవినీతి మీద పోరాటం చేయడం అంత సులభమా.. అంటే చాలా సందర్భాల్లో కాదనే సమాధానమే వినిపిస్తుంది.
ఒకవేళ ఎవరైనా అధికారి ఇంత నిజాయతీగా ఉంటే.. ఇదుగో.. ఈ అధికారిలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజాయతీగా ఉంటే ఫలితం.. ట్రాన్స్‌ఫర్‌లు. ప్రజలకు సేవ చేయడం కోసం ప్రభుత్వ కొలువులో చేరాడు. నీతి నిజాయతీలు అతడికి ఆరో ప్రాణం. ప్రాణాలు పోయినా సరే అవినీతిని అంగీకరించడు. తన కళ్లముందు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించడు. దాంతో ప్రజాప్రతినిధులకు అతడి వ్యవహార శైలి కంఠగింపుగా మారింది. ప్రతి పనికి అడ్డు పడుతుండటంతో.. బదిలీలు చేస్తూ పోయారు. ఆయన 20 ఏళ్ల సర్వీస్‌లో ఏకంగా 22 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాడంటే.. ఆయన ఎంత నిజాయతీపరుడో అర్థం చేసుకోవచ్చు. నిజాయతీ కారణంగా.. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆఖరికి భార్య కూడా ఆయనను అర్థం చేసుకోలేక.. వదిలేసి వెళ్లింది.
మరి ఇంత నిజాయతీపరుడు పదవిలో ఉంటే తమకే ప్రమాదమని భావించిన నేతలు ఆయనను అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. ఏళ్లుగా అవినీతిపై పోరాటం చేస్తున్న ఆయన విసిగిపోయి.. చివరకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే మన నేతలకు కంఠగింపుగా మారిన వ్యక్తి.. ఐక్యరాజ్య సమితి దృష్టిని ఆకర్షించాడు. ఐఏఎస్ కొలువుకు స్వస్థి చెప్పి.. ఐక్యరాజ్య సమితి తరఫున ప్రాన్స్‌లో పని చేయడానికి వెళ్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న వారికి.. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారు.. ఈ ఉద్యోగిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఆయన నిజాయతీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి అధికారి గురించి మీరు తెలుసుకొండి..
ఆ అధికారి పేరు రాజు నారాయణ స్వామి.. స్వస్థలం కేరళ, పాల్ఘాట్. చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. 1983లో పదో తరగతి పూర్తయ్యింది. స్టేట్ ఫస్ట్ మార్కులతో రికార్డు క్రియేట్ చేశాడు.. ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్.. ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో కూడా ఫస్ట్ ర్యాంకే. చెన్నై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. బ్యాచ్ టాపర్‌గా నిలిచాడు. ఇక అదే ఏడాది గేట్ పరీక్ష రాస్తే.. మళ్లీ ఫస్ట్ ర్యాంక్ అతడికే వచ్చింది. అతడి ప్రతిభను గుర్తించిన అమెరికా కంపెనీలు.. జాబ్ ఆఫర్ ఇస్తూ క్యూ కట్టాయి. గ్రీన్ కార్డ్, వీసా ఇచ్చి మరి మామెసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది.
ఇప్పటి కుర్రాళ్లకు ఇలాంటి ఆఫర్ వస్తే.. ఎగిరి గంతేసి మరి రెక్కలు కట్టకుని అమెరికా వెళ్లిపోతారు. కానీ రాజు నారాయణ స్వామి మాత్రం అమెరికా ఆఫర్‌ను తృణప్రాయంగా వదులుకున్నారు. అందరూ ఆయన్ని ఓ పిచ్చివాడిగా చూశారు. కానీ రాజు నారాయణ చెప్పిన సమాధానం వింటే.. ఆయనలో దేశభక్తి నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో అర్థం అవుతుంది. ‘‘నా చదువుకు.. మా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వ డబ్బు అంటే.. ప్రజా ధనం. ప్రజలు అంటే.. తిన్నా తినకపోయినా.. కష్టపడి చెమటోడ్చి.. ప్రభుత్వానికి పన్ను కట్టే పేదలు. వీరంతా తాము తినే తిండి దగ్గర నుంచి.. ఆఖరికి బస్సు టికెట్ట్‌పై కూడా పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బులతో నేను చదువుకున్నాను. వారి శ్రమతో ఈ స్థాయికి ఎదిగిన నేను.. ఇప్పుడు అమెరికా వెళ్తే.. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం లాంటిదే. నేను ఎక్కడికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను.. నా దేశ ప్రజల కోసం పని చేస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకుని.. విదేశాల్లో పని చేస్తున్న వారికి చెంప పెట్టులాంటిది ఈ సమాధానం.
అన్నట్లుగానే.. ప్రజలకు సేవ చేయాలంటే.. ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మార్గమని భావించాడు. దానిలో భాగంగా.. ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాడు. చదువులో ఫస్ట్ ర్యాంక్‌కు కెరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన వ్యక్తి.. యూపీఎస్సీ పరీక్షలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ట్రైనింగ్‌లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు రాజు నారాయణ స్వామి. పోస్టింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి నిమిషం ప్రజలకు సేవ చేయడం కోసం పరితపించాడు. తాను పని చేసే చోట అవినీతికి తావు ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే ఆచరణలోకి వచ్చే సరికి అది తాను అనుకున్నంత ఈజీ కాదని అర్థం అయ్యింది. ప్రజలకు మేలు చేయడం కోసం.. తన పై అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా పోరాడాల్సి రావడం జీర్ణించుకోలేకపోయాడు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. అవినీతిని మాత్రం ప్రొత్సాహించేది లేదనుకున్నాడు రాజు నారాయణ స్వామి. ఫలితంగా ప్రతి రోజు పోరాటమే చేయాల్సి వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. వెంటనే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. ‘‘నా అల్లుడు కలెక్టర్… నన్నేవరు అడ్డుకునేది.. ఆపేది అంటూ’’ విర్రవీగాడు. కానీ రాజు నారాయణ స్వామి మాత్రం.. తప్పు చేస్తే.. నా, పర భేదం లేదు. ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నాడు. తన మామ రోడ్డుకు అడ్డంగా కట్టిన భవనాన్ని కూల్చి వేశాడు. ఫలితంగా భార్య.. రాజు నారాయణ స్వామిని వదిలేసి పోయింది. ఇద్దరి మధ్య పొసగదని అర్థం చేసుకున్నాడు.. భార్య వెళ్లిపోయినందకు పెద్దగా బాధపడలేదు.
ఆ తర్వాత నుంచి మరింత దూకుడుగా ముందుకు వెళ్లాడు. ఓ సారి లిక్కర్ డాన్ అరాచకాలను ప్రశ్నిస్తే.. డాన్‌కు మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు. కానీ రాజు నారాయణ మాత్రం వెనక్కి తగ్గేది లేదు.. నా డ్యూటీ నేను చేస్తాను అన్నాడు. అంతే.. క్షణాల్లో ట్రాన్స్ ఫర్.. మళ్లీ కొత్త ఊరు… కొత్త పని. అక్కడ కూడా అవినీతే ముందుగా నారాయణకు ఎదురొచ్చింది. కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలు చేసుకోవడం కాంట్రాక్టర్లకు పరిపాటి అయ్యింది. ఆ తరువాత వానలు పడటం.. వర్షపు నీటి ధాటికి గట్టు కొట్టుకుపోవడం.. మళ్లీ టెండర్లు.. మళ్లీ అదే కాంట్రాక్టర్లు టెండర్లు వేయ్యడం.. బిల్లులు డ్రా చేసుకోవడం ఇదే వరస.
కానీ నారాణయ వచ్చాక.. దీనికి ఎండ్ కార్డ్ పడింది. ‘‘వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది’’ అని తేల్చి చెప్పాడు. దాంతో కాంట్రాక్టర్లు మంత్రులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిపి మినిస్టర్లు.. నారాయణకు కాల్ చేసి.. ఫోన్ చేసి బెదిరించారు. కానీ ఆయన మాత్రం.. వెనక్కి తగ్గేది లేదు అన్నాడు. నారాయణను ఏ శాఖలో వేసినా ఇబ్బందే అని తెలిసి.. అప్పటి కేరళ ముఖ్యమంత్రి అచ్చుతానందన్.. ఆయనను ఏప్రాధాన్యత లేని ఓ విభాగంలో వేశారు.
నారాయణ నిజాయతీ మన పాలకులకు నచ్చలేదు. కానీ విధి నిర్వహణలో ఆయన శ్రద్ధను చూసి ‘ఐక్యరాజ్య సమితి’ మా దగ్గర పని చేయండి అని కోరుతూ.. నారాయణను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అప్పటికే వ్యవస్థలోని అవినీతిపరులతో పోరాడి అలసిపోయిన రాజు నారాయణ.. ఇక ఇక్కడ ఇమడలేక.. తన తీరు మార్చుకోవడం ఇష్టంలేక.. ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఆయన నిర్ణయం ఎందరో అవినీతిపరులకు శుభవార్త అయ్యింది. అయితే కేవలం విధినిర్వహణలోనే కాక.. సాహిత్య పరంగా కూడా రాజు నారాయణకు మంచి పేరుంది.
ఇప్పటి వరకు ఆయన 23 పుస్తకాలు వ్రాశారు. వాటికి చాలా మంచి ప్రజాదరణ లభించింది. ఆయన వ్రాసిన నవలకు ‘సాహిత్య అకాడమీ’ అవార్డు కూడా వచ్చింది. అయితే విషాదం ఏంటంటే.. ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించాడు. కానీ వాస్తవ జీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం.. అడుగడుగునా పేరుకుపోయిన అవినీతితో పోరాడలేక అలసిపోయి దేశాన్ని వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ వెళ్లిపోతున్న విషయం తెలిసి ఆయన అభిమానులు, ప్రజలు విచారంతో పాటు.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికే పరిమితమైన మీ సేవలు.. ప్రపంచానికి చేరడం ఎంతో గర్వంగా ఉందని ప్రశంసిస్తున్నారు. అంతేకాక నీలాంటి నిజాయతీపరులు ఈ దేశంలో బతకలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు నారాయణ స్వామి లాంటి వ్యక్తలుకు మన సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.