“పవర్ ఫుల్ పీపుల్స్ మేక్స్.. ప్లేసెస్ పవర్ ఫుల్”. ఈ ఒక్క మాట చాలు గంగూలీ అంటే ఏమిటో చెప్పడానికి. ఇండియన్ క్రికెట్ కి సచిన్ తప్ప మరో అండ లేని రోజులవి. అప్పుడొచ్చాడు ఓ నూనూగు మీసాల కుర్రాడు. అతని పేరు సౌరవ్ గంగూలీ. గుండెల నిండా దైర్యం. పులి లాంటి చూపు. పుర్ర చేయి వాటం. మొదటి మ్యాచ్ లోనే లార్డ్స్ మైదానంలో సెంచరీ. క్రికెట్ పండితులు అంతా నివ్వెరపోయిన క్షణాలు అవి. తరువాత కాలంలో అతను వన్డే మ్యాచ్ ల్లో కూడా విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఫ్రన్ట్ కి వచ్చి కొట్టే ఆ సిక్స్ లు, ఆఫ్ సైడ్ కొట్టే ఆ కవర్ షాట్ లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేశాయి. ఫలితం సాధారణ సౌరవ్ గంగూలీ.. అతి తక్కువ కాలంలోనే రాయల్ బెంగాల్ టైగర్ అయిపోయాడు.
గంగూలీ ఆటగాడిగా ఎదుగుతూ వస్తున్న ఆ సమయంలోనే.., జట్టుగా టీమ్ ఇండియా పరిస్థితి దిగజారుతూ వచ్చింది. పదేళ్ల పాటు ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించిన మహమ్మద్ అజారుద్దీన్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. నెక్స్ట్ కెప్టెన్ గా ఎంపికైన సచిన్ దారుణంగా విఫలం అయ్యాడు. ఈ భారం నేను భరించలేను బాబోయ్ . కెప్టెన్ గా ఉండటం నా వల్ల కాదు అని తేల్చి చెప్పేశాడు సచిన్. అప్పటికే ఇండియన్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది.
వన్డే లలో జింబాబ్వే తరువాత స్థానానికి పడిపోయాము. టెస్ట్ లో మ్యాచ్ గెలవడమే మరచిపోయాము. ఆట చుట్టూ రాజకీయాలు, ఆటగాళ్లలో స్తైర్యం లేని క్షణాలు, అప్పటికే క్రికెట్ లో కొదమ సింహాల్లా దూసుకుపోతున్న ప్రత్యర్ధులు, చుట్టూ సవాళ్లు. ఇలా.. ఎటు చూసిన ఇండియన్ క్రికెట్ లో అంధకారమే తప్ప వెలుగు లేని క్షణాలు అవి. అలాంటి సమయంలో అందరికీ కనిపించిన ఒకే ఒక్క ఆశా దీపం సౌరవ్ గంగూలీ. కానీ.., గంగూలీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాక ఈ లెక్కలు అన్నీ ఇట్టే మార్చేశాడు.
ఇందుకోసం ముందుగా టీమ్ ని ప్రక్షాళన చేశాడు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాధ్, అగార్కర్ లాంటి సీనియర్స్ ని కలుపుకుపోయాడు. వారిలో ఉన్న అభద్రతా భావాన్ని తీసేశాడు. టీమ్ లో వారి ప్రాధాన్యత ఏమిటో వివరించి చెప్పాడు. మిగిలిన స్క్రాప్ మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. ఇదే సమయంలో జూనియర్ స్థాయి క్రికెట్ లో అప్పుడప్పుడే మెరుపులు మెరిపిస్తున్న కుర్రాళ్ళని వెతికి పట్టుకున్నాడు. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోని, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, బాలాజీ, హేమాంగ్ బదాని, పార్టీవ్ పటేల్, ఆశిష్ నెహ్రా ఇలా ఒకరేంటి ఆ సమయంలో ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వారందరిని తీసుకొచ్చి టీమ్ లో పెట్టుకున్నాడు గంగూలీ. ఈ విషయంలో సెలెక్టర్స్ తో ఫైట్ చేశాడు. జోన్స్ వారీగా జరిగే పాలిటిక్స్ కి బ్రేక్ వేసి.., ప్రతిభ ఉన్న ఆటగాడికే పట్టం కట్టాడు. సీనియర్స్, జూనియర్స్ ని కలగలిపి ఓ అద్భుత జట్టుని తయారు చేశాడు. అక్కడ నుండి అన్నీ అద్భుతాలే. ఇండియన్ క్రికెట్ కి స్వర్ణ యుగం మొదలైన క్షణాలు అవి.
ఇందుకే సౌరవ్ గంగూలీ అంటే కేవలం ఓ ఆటగాడు మాత్రమే కాదు.
గంగూలీ అంటే గుండెల నిండా నింపుకున్న ధైర్యం
గంగూలీ అంటే ఇన్సిపిరేషన్
గంగూలీ అంటే పోరాటం
గంగూలీ అంటే విజయం
గంగూలీ అంటే నిబ్బరం
గంగూలీ అంటే నిర్భయం
గంగూలీ అంటే ఆనందం
గంగూలీ అంటే ఫ్యాన్స్ కి పెద్ద అన్న
గంగూలీ అంటే ఇండియన్ క్రికెట్ తలరాత మార్చిన దేవుడు
ఇందుకే టీమ్ ఇండియాకి గంగూలీ అందించిన, అందిస్తున్న సేవలు అప్పటికి, ఇప్పటికి, ఇంకెప్పటికీ ప్రత్యేకమే.
చివరగా సినిమాటిక్ గా ఒక్క డైలాగ్.. ( ఖలేజా సినిమా)
పశ్చిమ బెంగాల్ లో 48 ఏళ్ళ కింద పుట్టాడొకడు…
నేరేడుపండు లాంటి కళ్ళు,
అరిటాకంత చెయ్య,
తుఫాను… తుఫాను కన్నా వేగంగా ఆలోచిస్తాడు..
ఆటలో వాడి తెగింపుకి దేశం అంతా సాహో అంది.
వాడి అండతోనే సాధారణ ఆటగాళ్లు స్టార్స్ అయ్యారు.
వాడి రాకతోనే ఇండియన్ క్రికెట్ ఒళ్ళు విరుచుకుంది.. సిద్దా..!
విదేశాల్లో పిల్లులు అన్న మన ఆటగాళ్లు కసిపుట్టినట్టు.. చెలరేగిపోయారు.
వాడు లార్డ్స్ మైదానంలో షర్ట్ విప్పి.. గర్జించిన గర్జన ఇంకా చెవుల్లో హోరుమంటోంది!
ఎవరిని చూడాలని మాలాంటి అభిమానుల కళ్ళు ఆర్తితో తడుస్తాయో,
ఎవరిని చూస్తే క్రికెట్ అభిమానులు అభిషేకం చేస్తారో,
ఎవడి వేలు చివర దశాబ్దాల పాటు.. గెలుపు బానిసై ఊడిగం చేసిందో,
ఎవడి ఆట చూస్తే ఆనందం మా నుదుటి మీద బొట్టవుతుందో…, ఎవడు చూస్తే.. ఓడిపోతామన్న భయం చస్తుందో…
ఎవడు కెప్టెన్ గా ఉంటే గెలుస్తామన్న ధైర్యం వస్తుందో…
ఎవడు కోట్ల మంది అభిమానుల ఆశలను దశాబ్దాలుగా మోశాడో..
ఎవడు.. మసకబారిన ఇండియన్ క్రికెట్ ఖ్యాతిని ను మళ్ళీ నిలబెట్టాడో
ఆ వన్ అండ్ ఓన్లీ.. ప్రిన్స్ ఆఫ్ కలకత్తా.. రాయల్ బెంగాల్ టైగర్.. ఇండియన్ క్రికెట్ బాస్.. సౌరవ్ గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.