దేశంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదవి నిరుద్యోగులుగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మంచి ఉద్యోగం వస్తుందని జీవితాంతం ఎదురు చూసేవాళ్లు కూడా ఉన్నారు. మరికొంత మంది ఉద్యోగం పై ఆశలు వదులుకొని చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తు జీవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదన ఉన్నాకూడా కొంత మంది లంచాలకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. ఐటీ అధికారులు దాడి చేసినపుడు కళ్లు చెదిరేలా సంపాదన చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించగా కళ్లు చెదిరేలా బంగారం, కట్టల కొద్ది డబ్బు చూసి షాక్ తిన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నందుకు గాను ఆ ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఒరిస్సాకు చెందిన ప్రమోద్ కుమార్ జెనా అనే వ్యక్తి భువనేశ్వర్ లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీ మేనేజర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేవారు. ఇటీవల ఆయన పదవీ విరమణ పొందారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్రమ సంపాదన సంపాదించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కి లెక్కకు మించిన ఆస్తులు ఉండటం గమనించిన అధికారులు ఆయనపై దృష్టి సారించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఒడిశాలోని ఉన్న ఆయన ఇంటిలో జనవరి 4న సోదాలు నిర్వహించారు.
సీబీఐ అధికారులు ప్రమోద్ కుమార్ జెనా సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పట్టబడ్డ నోట్ల కట్టలు చూసి షాక్ అయ్యారు. ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, బంగారు నగలు, వస్తువులు చూసి షాక్ కి గురయ్యారు. రూ.1.57 కోట్ల నగదు, 17 కిలోల బంగారం, రూ.2.5 కోట్ల విలువ గల బ్యాంక్ పత్రాలు, మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ బయట పడ్డాయి. అంతేకాదు భువనేశ్వర్, కటక్ ఇతర ప్రాంతాల్లో ప్రమోద్ కుమార్ కి ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ లో పని చేసి రిటైర్డ్ అయిన ప్రమోద్ కుమార్ జెనా లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.