నువ్వు మనిషివా? పలానా కులం వాడివా? అని అడిగితే.. రేయ్ మనం కులం వాళ్ళని మనుషులు కాదంటున్నాడురా అనే మనుషులు ఉన్నారు కొంతమంది ఇంకా ఈ సమాజంలో. కేవలం మనిషిని వృత్తుల వారీగా గుర్తించడానికి పెట్టుకున్న కులాన్ని.. మనిషిగా గుర్తించలేనంతగా వెనకబడి జీవిస్తున్నారు కొంతమంది. నిజానికి వెనుకబడిపోయింది తక్కువ కులం వారు కాదు, ఆ కులం వాళ్ళని మనుషులుగా గుర్తించలేని సమాజమే వెనకబడిపోయినట్టు. అంబేద్కర్ పుణ్యమా అని చాలా వరకూ కులం పేరుతో అంటరానితనం పోయింది. అయితే అక్కడక్కడా ఇంకా కుల బేధాలు చూపించే వెనకబడిన జాతి ఒకటి ఇంకా ఈ భూమ్మీద ఉండిపోయింది. ఒక మనిషిని మనిషిగా కాకుండా అంటరాని వాడిగా చూసే జాతి శేషం ఉండిపోయింది.
ఆ జాతికి చెందిన వారసులు గావచ్చు, ఒడిశాలోని బర్గర్ జిల్లాలో కుల వివక్ష పేరుతో.. సొంత బంధువులే మృతదేహాన్ని వెలివేశారు. అదేంటి సొంత బంధువుల కులం, చనిపోయిన వ్యక్తి కులం వేరే ఉంటుందా? వేరే ఉంటే బంధువులు ఎలా అవుతారు? అనే కదా మీ అనుమానం. ఇద్దరిదీ ఒకే కులం, కాకపోతే చనిపోయిన వ్యక్తి మృతదేహానికి దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పోస్టుమార్టం చేశాడు. ఈ కారణంగా మృతదేహాన్ని బంధువులు, గ్రామస్తులు దూరం పెట్టారు. కూలి పనులు చేసుకునే ముచును సంద అనే వ్యక్తి.. కాలేయ సంబంధిత సమస్యతో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముచును సంధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి అంబులెన్స్ లో అతని సొంత గ్రామానికి తరలించారు.
అయితే తక్కువ కులానికి చెందిన వాడన్న కారణం చూపించి.. ముచును బంధువులు, గ్రామస్తులు కనీసం చూడ్డానికి కూడా రాలేదు. మృతుడికి భార్య, మూడేళ్ళ కూతురు ఉన్నారు. భార్య ప్రస్తుతం కడుపుతో ఉంది. మృతుడి భార్య కడుపుతో ఉందన్న కనికరం లేకుండా అంత్యక్రియలకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో గ్రామ సర్పంచ్ సునీల్ బెహెరా గొప్ప మనసుతో అంత్యక్రియల బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అంబులెన్స్ డ్రైవర్, ఇతర వ్యక్తుల సాయంతో శవాన్ని చాపలో చుట్టి బైక్ మీద తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాదు అంబులెన్స్ కి అయిన 8 వేల రూపాయల ఛార్జీలను చందాలు వసూలు చేసి మరీ ఇచ్చామని సర్పంచ్ చెప్పారు.
ఏది ఏమైనా దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్.. తన వృత్తి ధర్మంలో భాగంగా ఒక మృతదేహానికి శవ పరీక్షలు చేయడమే ఈ మనుషుల దృష్టిలో పాపమా? గ్రామస్తులు వదిలేయడమే దారుణం అనుకుంటే, సొంత చుట్టాలే అంటరానితనం కారణంగా మృతదేహాన్ని చూడ్డానికి రాకపోవడం ఇంకెంత దారుణమో అర్ధమవుతోంది. చనిపోయిన వ్యక్తిది ఏ కులమైనా గానీ అంత్యక్రియలు జరపడం కనీస సంస్కారం. సంస్కారహీనులే అంటరానితనం పేరుతో మనుషులని దూరం పెడతారు. అయినా మనుషుల్ని వదిలేసి పోయినా మనిషికి అంటరానితనం ఏంటో పిచ్చి కాకపోతే. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Villagers were allegedly unhappy about the autopsy performed on the man after his death. Hence, they stayed away from the funeral.#Odisha | @iamsuffian https://t.co/VHDDgdIbLu
— IndiaToday (@IndiaToday) September 25, 2022