దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కొన్నాళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, పెళ్లి తదితర వాటి గురించి మీడియాలో వార్తలు వచ్చేవి. ఇప్పుడైతే ఆ టాపిక్‌ను పక్కకు పెట్టారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో.. దేశమంతా పాదయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో తన వ్యక్తిగత జీవితం, ఇష్టాఇష్టాలు వంటి వాటి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో వివరించాడు రాహుల్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
పెళ్లిపై ప్రశ్నించగా… దానికి రాహుల్ బదులిస్తూ.. ‘‘మా అమ్మ సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ ఇరువురులో ఉన్న లక్షణాలు.. నాకు కాబోయో జీవిత భాగస్వామిలో ఉండాలి. నానమ్మ ఇందిరా గాంధీ నాకు రెండో తల్లితో సమానం. ఇక నానమ్మ లక్షణాలున్న అమ్మాయి అయితే మరీ మంచిది. అలాంటి అమ్మాయికే నా ప్రాధాన్యత’’ అంటూ చెప్పుకొచ్చాడు.
అలానే కార్ డ్రైవ్ చేయడం కన్నా.. సైకిల్, మోటార్ సైకిల్ నడపడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ‘‘నాకు కార్లంటే ఇష్టం ఉండదు. నా దగ్గర సీఆర్-వీ కారు ఉన్నా.. అది మా అమ్మది. కార్లంటే ఇష్టం లేకపోయినా.. వాటిని రిపేర్ చేయడంలో నేను ఎక్స్‌పర్ట్‌ని. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు. అలానే తనపై వచ్చే విమర్శలపై కూడా రాహుల్ గాంధీ స్పందించాడు. ‘‘నన్ను తిట్టినా, కొట్టినా, ద్వేషించినా.. నాకెన్ని పేర్లు పెట్టినా నేను లెక్క చేయను. స్వాగతిస్తాను. నాపై విమర్శలు చేసే వారి జీవితంలో అసంతృప్తి కారణంగానే ఇలా చేస్తున్నారు అనుకుంటాను’’ అన్నాడు. మరి రాహుల్ గాంధీ కోరుకున్న లక్షణాలున్న జీవిత భాగస్వామి దొరుకుతుందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.