భార్య నిండు గర్భిణి. పురిటి నొప్పులు వస్తున్నాయని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు బయలుదేరాడు భర్త. ఇంకాసేపట్లో హాస్పిటల్ కి చేరుకుంటే.. ప్రసవం జరిగి పండంటి బిడ్డ తమ ఇంట్లో అడుగుపెడుతుందన్న ఆనందం మరొక వైపు. భర్త కారు నడుపుతున్నాడు. భార్య ముందు కూర్చుంది. వెనుక కుటుంబ సభ్యులు కూర్చున్నారు. కానీ మార్గం మధ్యలోనే ఊహించని ఘటన ఎదురైంది. ప్రసవం కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా.. కారులోంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ కాలి బూడిదయ్యారు. కళ్ళ ముందే తమ వాళ్ళు కాలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన కేరళలోని కన్నూరులో చోటు చేసుకుంది.
కన్నూరుకు చెందిన రీషా(26), ప్రిజిత్ (35) ఇద్దరూ భార్యాభర్తలు. రీషాకు పురిటి నొప్పులు ఎక్కువవ్వడంతో ప్రిజిత్ తన మారుతి కారులో భార్యను, మరో నలుగురు కుటుంబ సభ్యులను ఎక్కించుకుని హాస్పిటల్ కు బయలుదేరాడు. ముందు సీట్లో భార్య, భర్త కూర్చున్నారు. భార్య కారు నడుపుతున్నాడు. పక్క సీట్లో భార్య కూర్చుంది. కొంచెం దూరం వెళ్ళాక మార్గం మధ్యలో ఉన్నట్టుండి కారు బానెట్ (ముందు భాగం) నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో వెనుక సీట్లో కూర్చున్న వాళ్ళు వెంటనే కారు దిగేశారు. ఐతే ముందు కూర్చున్న భార్య, భర్తలు దిగుదామనుకుంటే కారు డోర్లు ఓపెన్ కాలేదు. దీంతో వారిద్దరూ ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వచ్చేసరికే వారిద్దరూ ప్రాణాలు విడిచారు. కాపాడేందుకు ప్రయత్నిద్దామనుకున్నా.. ఆయిల్ ట్యాంక్ పేలుతుందేమో అన్న భయంతో కాపాడలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్ళ ముందే తమ వాళ్ళు కారులో కాలిపోతుంటే చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కారులో ఉన్న దంపతులు భయంతో కేకలు వేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోంచి మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రమాదం నుంచి ఎలా బయట పడచ్చు? ఇలాంటి ప్రమాదం జరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.