పున్నామ నరకం నుంచి కాపాడే వారే పుత్రులు అనేది నానుడి. అయితే.. నేటి కాలంలో కొందరు పుత్ర రత్నాలు తల్లితండ్రులను ఆ నరకంలోకి నెట్టేస్తున్నారు. కన్నవారు బతికున్న సమయంలో వారిని పట్టించుకోకుండా, చనిపోయాక వారి అంత్యక్రియలకి హాజరుకాకుండా తమ కఠిన హృదయాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తాజాగా ఒరిస్సాలో చోటు చేసుకుంది. కానీ.. ఆ తల్లి కడుపున పుట్టిన ఆడపిల్లలే అన్నీ తామై ఆ అమ్మని పున్నామ నరకం నుంచి తప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఒరిస్సాలోని పూరీ పట్టణంలో మంగళ ఘాట్ అనే ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. ఇటీవల అనారోగ్యంతో ఆమె మరణించింది. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నా.. వారు తల్లిని కడసారి చూసేందుకు రాలేదు. తోడబుట్టిన అన్నదమ్ములు తల్లి అంతిమయాత్రకు రాకపోవడంతో ఆ నలుగురు అక్కచెల్లెళ్లు సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడెని భుజనా ఎత్తుకున్నారు.
4 కిలోమీటర్ల దూరంలోని స్వర్గ ద్వార్ స్మశాన వాటిక వరకు తల్లి శవాన్ని మోసుకుని వెళ్లి, అంత్యక్రియలు నిర్వహించి కన్నతల్లి రుణం తీర్చుకున్నారు. పున్నామ నరకం నుండి తప్పించడానికి మీసాలు మెలేసే మగమహారాజులే అవసరం లేదు.., తల్లితండ్రిని ప్రేమించే మంచి మనసున్న కూతుర్లు ఉన్నా సరిపొతుందని ఈ ఆడబిడ్డలు నేటి సమాజానికి చాటి చెప్పారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.