పీరియడ్స్ (రుతు స్రావం) ఈ విషయం చర్చించడానికే కాదూ, ప్రస్తావించడానికి ఇష్టపడని రోజుల నుండి అవగాహన కల్పించే రోజులకు చేరుకున్నాం. మహిళలు నెలసరి మూడు రోజుల పాటు పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఒక్కో మహిళ ఒక్కో రకమైన బాధను అనుభవిస్తారు. కొంత మంది మహిళలు, యువతులు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే..మరికొంత మంది నరాలు, నడుముతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను గుర్తించిన ఆ ప్రభుత్వం.. నెలసరి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
అదే కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్ డి ఎఫ్) ప్రభుత్వం. ఉన్నత విద్యా శాఖ పరిధిలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అమ్మాయిలుకు ఈ సెలవులు మంజూరు చేస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ శాఖ పరిధిలోని అన్ని యూనివర్శిటీల్లోని విద్యార్థినులకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్ బిందు తెలిపారు. కాగా, కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్) తన విద్యార్థులకు ఈ పీరియడ్ లీవ్ ఇవ్వాలని తొలుత ముందుకొచ్చిందని, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నేతృత్వంలోని విద్యార్థి సంఘాల డిమాండ్ల మేరకు కుశాట్ లో పీరియడ్ సెలవులకు ఆమోదం తెలిపినట్లు బిందు వెల్లడించారు.
కుశాట్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ప్రతి సెమిస్టర్ లో కూడా విద్యార్థినిల హాజరు పెంచడానికి ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు. కొచ్చిన్ యూనివర్శిటీలో 8 వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో సగానికి పైగా అమ్మాయిలే ఉన్నారు. రుతుస్రావం సమయంలో అమ్మాయిలు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఈ సెలవులను అన్ని రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో అమలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని బిందు ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి సెమిస్టర్ కు 73 శాతం హాజరు తప్పని సరి ఉండగా.. ఈ తాజా నిర్ణయంతో అమ్మాయిలకు మారో 2 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. యూనివర్శటిల్లో చదువుతున్న పిహెచ్ డి విద్యార్థినులతో పాటు విద్యార్థినులందరికీ ఈ మూడు రోజుల సెలవులు వర్తిస్తాయని ఆమె చెప్పారు. పీరియడ్స్ లీవ్స్ గురించి కేరళ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.