ఎన్నో ఆచారాల గురించి వినుంటారు. అయితే దీని గురించి మాత్రం ఎప్పుడూ వినుండరు. ఓ ఆలయంలో పురుషులు స్త్రీల వేషధారణలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాలు..
మన దేశంలో ఒక్కో దగ్గర ఒక్కో ఆచారం ఉంటుంది. ప్రాంతాలను బట్టి పాటించే ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో ఆచారం ఉంటుంది. వీటిల్లో కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఓ ఆచారాన్ని కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చూడొచ్చు. కేరళ రాష్ట్రం, కొల్లాంలోని చవరాలో ఉన్న ఈ ప్రసిద్ధ దేవాలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాల్లో భాగంగా ఆఖరి రెండ్రోజుల్లో వేలాది మంది పురుషులు మహిళల వేషధారణలో పూజలు చేశారు. 19 రోజుల పాటు ఈ వార్షిక ఆలయ ఉత్సవాలు జరుగుతాయి. అయితే చివరి రెండ్రోజుల్లో పురుషులు మహిళల వేషధారణ చేస్తే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ‘కొట్టన్‌కులంగర చమయవిళక్కు’ అని పిలుస్తారు. ఇందులో భాగంగా వందలాది మంది మగవారు స్త్రీల వేషధారణలో కొట్టన్‌కులంగర దుర్గ భగవతి గుడిలో దీపార్చన చేశారు. చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవ సమయంలో వారు కూడా గుడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది మలయాళీ నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో ఆలయానికి చేరుకుంటారు. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వారు వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మరి.. ఈ వింత ఆచారం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.