‘నీళ్లంటే ప్యారిస్ వాళ్లకి కూడా భయమే. అందుకే వంతెన కట్టారని’ మన్మధుడు సినిమాలో నాగార్జునతో బ్రహ్మానందం అంటారు. అలానే రైల్వే ట్రాక్ ల మీద నడిస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు కట్టింది. కానీ బ్రిడ్జ్ లు ఎక్కి వెళ్తే ఆలస్యం అయిపోద్దని ప్లాట్ ఫారం దిగి రైల్వే ట్రాకులు దాటుకుంటూ అవతల ప్లాట్ ఫారం ఎక్కే ప్రయత్నం చేస్తారు. అంతా కంగారు. ఇప్పుడంత పెద్ద బిజినెస్ ఏముందనో. ఏదో పెద్ద అంబానీ అన్నట్టు, విదేశాల్లో పది, పదిహేను ఫ్యాక్టరీలకు వీళ్ళే ఓనరన్నట్టు, వీళ్ళు టైంకి వెళ్లకపోతే మొత్తం బిజినెస్ షట్ డౌన్ అయిపోద్దన్నట్టే ఫీలైపోతారు. వెనక వీళ్ళని నమ్ముకుని ఒక కుటుంబం ఉందని ఆలోచించరు. టైం గురించి ఆలోచించే మనిషిలా ఓ తెగ బిల్డప్ లిస్తారు.
బయలుదేరే ముందు ఒక పావు గంట ముందో, అరగంట ముందో బయలుదేరితే కొంపలు మునుగుతాయా? అబ్బే కరెక్ట్ టైంకి బయటకు వస్తారు. కంగారు కంగారుగా ఓ తెగ పరిగెడుతుంటారు. ఒకవేళ ఇతరుల వల్ల ఆలస్యం అయ్యిందనుకోండి. అయితే మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ‘అరె మన కోసం రైల్వే ఓళ్ళు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేశారు, ప్రత్యేకించి డబ్బులు పే చేయక్కర్లేదు, దాన్ని వాడదాం’ అని ఉండదు. ప్లాట్ ఫారం దిగేసి ట్రాకుల మీద నుంచి నడిచేయడమే. గబుక్కున ట్రైన్ వస్తే దాని కింద పడిపోవడమే. ఇంకేముంది టైం అయిపోయినట్టే. టైం అయిపోయిందని కంగారుపడితే పైకి పోతారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం చాలా అదృష్టవంతుడు. మీద నుంచి రైలు దూసుకెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు.
బీహార్ లోని భాగల్పూర్ రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి ఇవతల నుంచి అవతలి ప్లాట్ ఫారం మీదకు వెళ్లాలని అనుకున్నాడు. కానీ ప్లాట్ ఫారం మీద గూడ్స్ రైలుబండి ఆగి ఉంది. అరెరే పెద్ద సమస్యొచ్చి పడిందే ఇప్పుడెలా అని ఆలోచించాడు. గూడ్స్ బండి కింద నుంచి పట్టాలు దాటి వెళ్లకూడదా? అని అనుకున్నాడు. ఇంకేముంది ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. మరి పైలట్ మావకి ఒక మాట చెప్తే ఆపేవాడు. రైలుని కాదు, మనోడ్ని. నాలుగు పీకి పో బయటకి అని తన్ని తరిమేసేవాడు. మనోడు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా రైలు కదిలింది. ఇంకేముంది మనోడికి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి.
ఇదెక్కడి మాస్ రా మావ నాయనా అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుని దేవుడ్ని తలచుకుంటూ కాసేపు పట్టాలకి అతుక్కుపోయాడు. మెల్లగా గూడ్స్ రైలు వెళ్తుంది. మొత్తానికి గూడ్స్ రైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హమ్మయ్యా బతికే ఉన్నానననుకుని పైకి లేచి బట్టలు దులుపుకుని ఏదో పెద్ద సాహసం చేసినట్టు నవ్వుకుంటూ వస్తున్నాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి ఎవడైనా వెళ్తాడు, కానీ రైలు కింద పడుకుని వెళ్ళేవాడికే ఒక రేంజ్ ఉంటుందని కాబోలు మనోడు ఇలా ట్రై చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇతనికి పెళ్ళైతే మాత్రం వీళ్ళావిడ చేతుల్లో ఉంటది చాకిరేవు అని వీడియో చూసినోళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. రైలు కదులుతుందని కంగారు పడి పైకి లేవకుండా రైలు వెళ్లెవరకూ అలానే బోర్లా పడుకుని ఉన్నాడు. ఏ మాత్రం భయపడి కొంచెం తల పైకి ఎత్తినా కూడా ఇదే వార్త సీరియస్ అయ్యేది. అయినా ఇలాంటి పిచ్చి సాహసాలు చేయకండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్తేనే సురక్షితం.
बिहार के भागलपुर में खड़ी ट्रेन के नीचे से निकलने में फंसा यात्री..किसी तरह बच गई जान@IRCTCofficial @RailwaySeva pic.twitter.com/4RDHrZNZOH
— Thakur Shaktilochan shandilya (@Ershaktilochan) November 10, 2022