మనలో కొంత మందికి పాము చూస్తే చాలు భయంతో దూరంగా పరిగెడుతారు. మరికొందరు అయితే కర్రతో అందుకొని దాని ఊపిరి తీసేవాళ్లుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగుపాముకు నోటితో ఆక్సిజన్ అందించి దాని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో ఓ వ్యక్తి ఇంట్లోకి నాగుపాము కనబడింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. జిల్లాకు చెందిన స్నేహాశీష్ అనే వ్యక్తి స్థానికంగా పాములను పట్టుకుంటుంటాడు. ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేహాశీష్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు.
ఊపిరి ఊదాలని తలచాడు. చుట్టుపక్కల చూడగా ఓ స్ట్రా కనపడింది. వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఆ పాముకు ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాముకి ప్రాణం పోసిన స్నేహాశీష్‌పై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.