టమాట ధర మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో కేజీ టమాటా ధర రూ. 200పై చిలుకు పలుకుతోంది. రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఈ పంట.. సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుతుంది. ఇక దరిదాపుల్లో కూడా ధర దిగివచ్చేలా కనిపించడం లేదు.
టమాట ధర మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో కేజీ టమాటా ధర రూ. 200పై చిలుకు పలుకుతోంది. రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఈ పంట.. సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుతుంది. ఇక దరిదాపుల్లో కూడా ధర దిగివచ్చేలా కనిపించడం లేదు. ఈ సమయంలో టమాటాల వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఎర్రపండు కోసం హత్యలు, టమాటా కోసం సెక్యూరిటీలు పెట్డడం, యాపిల్ ధరతో పోటీపడటం వంటివి చూశాం. ఇక అది చేయించిన చిత్ర, విచిత్ర సంఘటనలైతే చెప్పనక్కర్లేదు. కూతురు పుట్టిన రోజుకు 400 కేజీల టమాటాలు ఓ తండ్రి పంచితే.. తులాభారం వేసి మొక్కు తీర్చుకున్నాడు మరో తండ్రి. అలాగే రెండంటే రెండు టమాటాలు తనను అడక్కుండానే కూరలో వేశాడని భార్య.. భర్తను వదిలేసి వెళ్లిపోయిన సంఘటన చూశాం.
తాజాగా టమాటాల కోసం ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను తాకట్టు పెట్టిన వింత ఘటన చోటుచేసుకుంది. పోనీ ఆ ఇద్దరు చిన్నారులు.. అతడి పిల్లలా అంటే కానేకాదూ. ఇంతకు ఏం జరిగిందటే.. ఒడిశాలోని కటక్ నగరంలో ఓ వ్యక్తి.. తాను వాషింగ్ మిషన్ కొనుగోలు చేశానని, దాన్ని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ఇద్దరు పిల్లల్ని పని నిమిత్తం పిలిచాడు. మీ ఇద్దరికీ రూ. 300 చొప్పున కూలీ ఇస్తానని నమ్మించాడు. పని వస్తుందని నమ్మిన చిన్నారులు.. అతనితో పాటు వెళ్లారు. మార్గ మధ్యలో ఛట్రా బజార్లో ఉన్న ఓ కూరగాయల దుకాణానికి ముగ్గురు వెళ్లారు. అక్కడ 4 కిలోల టమాటాలు కొనుగోలు చేశాడు సదరు వ్యక్తి. మరో 10 కిలోల టమాటాలు కావాలని, అయితే తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. ఈ నాలుగు కిలోలు దగ్గర్లో ఉన్న బంధువులకు ఇచ్చేసి, డబ్బులు తెస్తానని చెప్పి, అప్పటి వరకు పిల్లల్ని అక్కడే ఉండమని చెప్పాడు.
అయితే సదరు కూరగాయల వ్యాపారి ఆ పిల్లలు, టమాటాలు కొన్న వ్యక్తి పిల్లలే అనుకున్నాడు. పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి వెళ్లడంతో.. తిరిగి డబ్బులు తీసుకుని వస్తానని చెప్పడంతో సదరు వ్యాపారి నమ్మాడు. టమాటాలతో వెళ్లిపోయిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాకపోవడంతో.. మీ నాన్న ఇంకా రావట్లేదని పిల్లల్ని అడిగే సరికి.. వారు ఖంగుతిన్నారు. అతడు మా తండ్రి కాదని, పని ఉందని తీసుకువచ్చినట్లు చెప్పడంతో కూరగాయల వ్యాపారి ఖంగుతిన్నాడు. చివరకు వచ్చింది కేటుగాడు అని తెలిసి నోరెళ్లబెట్టాడు. ప్రస్తుతం ఒడిశాలో కిలో టమాటా రూ. 240 నడుస్తోందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే సుమారు వెయ్యి రూపాయల విలువ చేసే టమాటాల్ని మోసగాడు.. చాకచక్యంగా దొంగిలించడన్నమాట.