మన దేశంలోకి అక్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తరలించాలనుకున్న విదేశీ కుట్ర భగ్నమైంది. అక్రమంగా తరలించేందుకు తీసుకొచ్చిన రూ.425 కోట్ల విలువైన హెరాయిన్‌ను కోస్ట్‌గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు.
దేశంలోకి అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేయాలన్న విదేశీ కుట్ర మరోసారి భగ్నమైంది. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన ఇరాన్ పడవను గుజరాత్ తీరంలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఆ బోటులో సోదాలు నిర్వహించగా.. రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ పడవలోని ఐదుగురు ఇరానీ దేశస్థులను అరెస్ట్ చేశారు. సముద్ర మార్గం ద్వారా భారీగా డ్రగ్స్‌ను దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి రెండు పడవలతో అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ నిర్వహించారు.
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుజరాత్‌లోని కచ్ జిల్లా, జాఖౌ తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో ఒక పడవ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని పట్టుకునేందుకు కోస్ట్ గార్డ్ పడవలు వెళ్లాయి. వాటిని చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ తీరప్రాంత భద్రతా సిబ్బంది వారిని ఛేజ్ చేసి మరీ అడ్డుకున్నారు. ఆ పడవను ఇరాన్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అందులోని ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పడవలోని రూ.425 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని డిఫెన్స్ పీఆర్వో పేర్కొన్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కోసం ఆ పడవను జాఖౌ తీరానికి తీసుకెళ్లామని చెప్పారు.