తిమ్మిని బమ్మిని చేసినా, బమ్మిని తిమ్మిని చేసినా..స్త్రీలే గర్భం దాలుస్తారు. వాళ్లే పిల్లల్నికంటారు. భూమాతకున్న ఓర్పు ఉంటుందీ కాబట్టే ఆడవాళ్లకు మాత్రమే పురిటి నొప్పులు భగవంతుడు పెట్టాడంటారు పెద్దోళ్లు. అండం రూపంలో కడుపులో పడిన నాటి నుండి బిడ్డగా బయటకు వచ్చేంత వరకు నవమోసాలు కడుపులో పెట్టుకుని, వారి రాకకై ఎంతో ఎదురుచూస్తుంటారు మహిళలు. అయితే ఇప్పుడు ఓ అంశం అంతటా చర్చకు తెరలేపింది. అదే దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ల జంట తల్లిదండ్రులు కావడం.
కేరళలోని కోజికోడ్ లో నివసిస్తుందో ట్రాన్స్ జెండర్ల జంట. ఆమె పేరు జియా పావల్, అతడి పేరు జహాద్. వీరిద్దరూ మూడేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. వీరిలో జియా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్ల వైరల్ కావడంతో పాటు చర్చకు దారి తీశాయి. అందులో పురుష దుస్తుల్లో ఉన్న వ్యక్తి గర్భం దాల్చి ఉండటం. ట్రాన్స్ జెండర్ గర్భం దాల్చడమేమీటీ, ఇదేమీ వింత, ఇది ఎలా సాధ్యమన్నదీ ఈ వార్త చదివిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. జియా పురుషుడి నుండి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారాడు.
సాధారణంగా పుట్టుకతో కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల కొంత మందిలో పురుషుల్లో స్త్రీ లక్షణాలు, స్త్రీలో పురుష లక్షణాలు ఉంటాయి. హార్మోన్ల ప్రభావం కారణంగానే వారూ అలా ప్రవర్తిస్తుంటారు. వీరూ చేసే ప్రతి చర్య కూడా విభిన్నంగా ఉంటుంది. దీంతో వీరిని ఇంట్లో నుండి సమాజం వరకు వేలెత్తి చూపేవాళ్లే. అలా బతకలేక, చావలేక కొంత మంది ట్రాన్స్ జెండర్లుగా మారుతుంటారు. తమ శరీర భాగాలను మార్పులు చేసే విధంగా చికిత్స చేయించుకుంటారు. దీన్ని సెక్స్ రీఎసైన్ మెంట్ సర్జరీ అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ కూడా ఖర్చుతో కూడుకున్న పనే.
ట్రాన్స్ జెండర్ గా మారాలనుకునే వాళ్లకు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇందులో కూడా కొన్ని షరతులు ఉంటాయి. జెండర్ డిస్ఫోరియా ఉందా లేదని సైకాలజిస్ట్ లు నిర్ధారిస్తారు. ఉందని తేలితే.. హార్మోన్ థెరపీ చేసి.. ఆపై సర్జరీకి సిద్ధం చేస్తారు. లింగ మార్పిడి ఆపరేషన్ కు 5-7 గంటల సమయం పడుతుంది. ఇందులో భాగంగా వక్షోజాలు, జననాంగాలు, ముఖానికి శస్త్ర చికిత్స చేస్తారు. ఏడాది పాటు హార్మోన్ల థెరపీ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ట్రాన్స్ జెండర్లుగా మారాక వారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఇదే అంశం.. జియా-జహాద్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారికెలా సాధ్యమని గుసగుసలాడుకుంటున్నారు.
జియా, జహాద్ లు కూడా పుట్టుకతో పురుష, స్త్రీలుగా జన్మించినప్పటికీ.. తర్వాత హార్మోన్ల ప్రభావం కారణంగా లైంగిక అవయవాల మార్పులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులను ఈసడించుకోవడంతో.. వీరిద్దరూ జీవించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం వీరికి హార్మోన్ థెరపీ జరుగుతుందీ. అయితే.. పిల్లలు కావాలనుకుని భావించి జహాద్, జియా కొన్ని శరీర అవయవాలను తొలగించుకోలేదు. జహాద్ గర్భం, ఇతర శరీర అవయవాల మార్పిడి చేయించుకోలేదు. దీంతో జియా కారణంగా అతడు గర్భం దాల్చాడు. దేశంలో ఓ పురుష ట్రాన్స్ జెండర్ ఓ బిడ్డకు జన్మనివ్వబోవడం దేశంలో బహుశా ఇదే తొలి ఘటన కావొచ్చు. వీరిద్దరూ తమ బిడ్డకు మార్చిలో స్వాగతం పలకబోతున్నారు. మిగిలిన ట్రాన్స్ జెండర్లకు భిన్నంగా ఉండాలని భావించామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో జియా తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత జహాద్ హార్మోన్ థెరపీని మళ్లీ తీసుకుంటాడని చెప్పారు. ట్రాన్స్ జెండర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.