ఢిల్లీలోని ఒక 5 స్టార్ హోటల్ లో తనకు హెయిర్ కటింగ్ సరిగా చేయలేదని, జుట్టు చెప్పినదానికంటే ఎక్కువ కత్తిరించారని ఒక మోడల్ జాతీయ వినియోగదారుల ఫారంకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు జాతీయ వినియోగదారుల ఫారం.. స్టార్ హోటల్ కు రూ. 2 కోట్ల నష్టపరిహారం విధించింది. హోటల్ సెలూన్ లో ఒక మహిళా సిబ్బంది మోడల్ కు తప్పుగా హెయిర్ కట్ చేయడం వల్ల.. సదరు మోడల్ వేదనకు గురైందని, ఆర్థిక నష్టానికి గాను రూ. 2 కోట్లు చెల్లించాలని 5 స్టార్ హోటల్ ను ఆదేశించింది. అయితే మోడల్ కు రూ. 2 కోట్లు చెల్లించాలని జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. 2018 ఏప్రిల్ 12న ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ లో సెలూన్ కి ఆష్నా రాయ్ అనే మోడల్ హెయిర్ కట్ చేయించుకుంది. హెయిర్ కటింగ్ ఎలా ఉండాలో అనే దానిపై ఆమె సూచనలు ఇచ్చింది. అయితే మోడల్ చెప్పినట్టు కాకుండా.. 4 అంగుళాల జుట్టు ఉంచి.. మిగిలిన జుట్టు మొత్తం కత్తిరించారు. దీని వల్ల ఆ మోడల్ మోడలింగ్ రంగంలో అవకాశాలు కోల్పోయానని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను (ఎన్సీడీఆర్సీ) ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళలకు జుట్టే సంపద అని, మోడలింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి జుట్టు ఎంతో ముఖ్యమైనదని ఎన్సీడీఆర్సీ వెల్లడించింది.
టాప్ మోడల్ అవ్వాల్సిన ఆమె హెయిర్ కట్ సరిగా లేని కారణంగా అవకాశాలను కోల్పోయిందని తెలిపింది. సెప్టెంబర్ 2021లో బాధిత మోడల్ కు రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఐటీసీ మౌర్య హోటల్ యాజమాన్యంను ఆదేశించింది. తమ సంస్థ ఇజ్జత్ కే సవాల్ అంటూ.. ఈ ఆదేశాలపై ఐటీసీ మౌర్య యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీంతో జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మోడల్ కి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి.. కోర్టుకు సాక్ష్యాలు కావాలని పేర్కొంది. ఆమె గత బ్రాండ్ ఎండార్స్మెంట్, మోడలింగ్ వర్క్ లేదా ఆమె ఏదైనా బ్రాండ్ తో ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలను చేసుకుంటే ఆధారాలు చూపించాలని కోర్టు మోడల్ ఆష్నా రాయ్ ను కోరింది.
అయితే ఆమె ఎటువంటి ఆధారాలను చూపకపోవడంతో రూ. 2 కోట్ల పరిహారం సరైనది కాదని, అన్యాయమని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ మోడల్ కు అన్యాయం జరిగిందని రుజువు చేస్తే పరిహారం ఇవ్వడానికి అంగీకారమని కోర్టు తెలిపింది. అయితే ఆధారాలు లేకపోవడం వల్ల 2 కోట్ల రూపాయల పరిహారం అడగడం అన్యాయమంటూ పేర్కొంది. మరి ఐటీసీ మౌర్య యాజమాన్యం మోడల్ కు రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలన్న జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.