చీకోటి ప్రవీణ్.. ఈ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అని అందిరికీ తెలిసిందే. వారానికి రూ.40 లక్షల ఆదాయం, రాజకీయ నాయకులతో సంబంధాలు, సినీ ప్రముఖులతో మీటింగ్‌లు, విమానాల్లో విదేశాల్లో క్యాసినోకి తీసుకెళ్తుంటాడు.. ఇలా ఎన్నో వార్తలు విన్నాం. అయితే వీటన్నింటిలో కామన్ గా ఉన్న పాయింట్ క్యాసినో. అవును అసలు క్యాసినో అంటే ఏంటి? ఎందుకు దానికోసం విదేశాలకు వెళ్తుంటారు? మన దేశంలో అవి లేవా? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు క్యాసినోలు ఉండవు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
క్యాసినో అనేది కాసా అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చింది. కాసా అంటే ఇల్లు అని అర్థం. సాధారణంగా హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈ క్యాసినో సెటప్ పై ఓ అవగాహన ఉంటుంది. ముఖ్యంగా జేమ్స్ బాండ్ 007 సినిమాలో ప్రతి పార్ట్ లో ఒకసారి అయి క్యాసినోని చూపించాల్సిందే. ఒక విలాసవంతమైన భవంతిలో చుట్టూ జిగేల్ అనే లైట్లు, హడావుడి, మధ్యలో గ్రీన్ కలర్ టేబుల్ దాని చుట్టూ సిగార్లు, మందు గ్లాసులు పట్టుకున్న వ్యక్తులు పేకాడుతూ కనిపిస్తుంటారు. దానినే క్యాసినో అంటారు.
అయితే రియాలిటీ మాత్రం సినిమాల్లో అంత గ్రాండ్‌గా ఉండకపోయినా కూడా అందుకు దగ్గరిగానే ఉంటుంది. దీనిలో ఎక్కువగా గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నైపుణ్యంతో పనిలేదు అదృష్టమే మీకు డబ్బు తెచ్చిపెడుతుంది. మీలో ఎంత స్కిల్ ఉన్నా చివరికి మీ అదృష్టం మీదే మీరు ఆధారపడాల్సి ఉంటుంది. మీరు బాగా కన్ఫ్యూస్ అవుతున్నారేమో.. చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక ఆటగాడు గేమ్ నేర్చుకోవడం అనేది స్కిల్.. ఆ స్కిల్‌తో అతను ఆటలో గెలవచ్చు/ఓడిపోవచ్చు. కానీ, అతను గెలుస్తాడు, ఓడిపోతాడంటూ బెట్ కట్టడాన్ని గ్యాంబ్లింగ్ అంటారు. ఈ గ్యాంబ్లింగ్ లో స్కిల్ తో పనిలేదు.. కేవలం అదృష్టమే అంతా డిసైడ్ చేస్తుంది.
ఈ క్యాసినోలో పోకర్, అందర్ బాహర్, తీన్ పత్తీ, బ్లాక్ జాక్, రూలెట్, బాక్రా, క్రాప్, టైగర్ డ్రాగన్ వంటి ఆటలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని లాటరీలకు సంబంధించిన మెషినరీ ఆటలు కూడా ఉంటాయి. వీటిలో డబ్బు రావడం, పోవడం పక్కన పెడితే కేవలం వినోదం కోసం కూడా ఈ క్యాసినోలకు వెళ్తుంటారు. కావాలంటే ఆడుకోవచ్చు లేదంటే తాగుతూ, తింటూ రిలాక్స్ అవ్వచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చికోటి ప్రవీణ్ విమానాలు నడుపుతూ విదేశాలు తీసుకెళ్లాడంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఒక రాష్ట్రంలో క్యాసినో పెట్టాలా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. వాళ్లు కావాలనుకుంటే క్యాసినోలకు అనుమతి ఇవ్వొచ్చు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో జూదం మీద నిషేధం ఉంది కాబట్టి క్యాసినో పెట్టేందుకు వీలు లేదు. అయితే ఆదాయాన్ని పెంచుకునేందుకు విశాఖలో ఫ్లోటింగ్ క్యాసినోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇండియాలో గోవా, సిక్కిం, డయ్యూ అండ్ డామన్ లో మాత్రమే క్యాసినోలు నడుస్తున్నాయి. అక్కడ బెట్టింగ్ చట్టబద్ధం కాబట్టి క్యాసినోలకు అనుమతులు ఉన్నాయి.
అంతేకాకుండా ఎవరికి అనుమతి ఇవ్వాలి అనేది కూడా అక్కడి ప్రభుత్వాల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గోవాలో 21 ఏళ్లలోపు వారికి క్యాసినో ఆటలు ఆడేందుకు అనుమతి లేదు. అదే సిక్కింలో 18 ఏళ్లు నిండినవారికి అనుమతి ఉంది. ఈ క్యాసినో వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.