విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ‘నువ్వు నాకు నచ్చావ్’చెప్పుకొవచ్చు. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కోటి స్వరాలు అందించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు. 2001లో విడుదలైన ఈ సినిమా
విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీగా ‘నువ్వు నాకు నచ్చావ్’చెప్పుకొవచ్చు. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కోటి స్వరాలు అందించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు. 2001లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాను టివీలో వేస్తుంటే అనేక మంది చూస్తుంటారు. బ్రహ్మానందం ఎపిసోడ్ ఈ సినిమాకే హైలెట్. ముందు జాగ్రత్త మనిషిగా హడావుడి చేస్తారు. వాటర్ వరల్డ్‌కు వెళుతున్న సమయంలో కారు టైర్ పంచరై.. అప్పుడే అటుగా వస్తున్న వెంకటేష్ కారు ఆపుతాడు మన బ్రహ్మి. వాటర్ వరల్డ్ కు లిఫ్ట్ అడుగుతాడు. అప్పుడు తన కారు వద్దకు వెళ్లి..తన వస్తువులు తీసుకుని కారు ఫ్రంట్, బాక్ డోర్సే కాకుండా.. వెనుక ఉండే డిక్కీకి, ఫ్రంట్ ఏకంగా ఇంటికి వేసే తాళాలు వేసి హీరో కారు ఎక్కుతాడు.
ఎందుకు అన్నీ తాళాలు వేశారని అడిగితే.. ఎవ్వరూ దొంగిలించకూడదని ముందు జాగ్రత్త చర్యగా ఇలా చేశానంటాడు. ఈ మొత్తం సీన్ కామెడీని పండిస్తుంది. ఇప్పుడు అదే జాగ్రత్తతో ఏకంగా రైలుకు, రైలు పట్టాలకు తాళాలేశారో చోట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమండీ. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు నీట మునిగాయి. చెరువులు పొంగి రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వరంగల్ జిల్లాలో పలు రైల్వే స్టేషన్లలోకి వాన నీరు చేరడంతో పాటు ట్రాకులపై వరద నిలిచిపోయింది. దీనికి తోడు హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు దగ్గర వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు. కొన్నింటిని రద్దు చేశారు.
అటుగా వెళ్లాల్సిన గూడ్స్ రైలు కాజీ పేట స్టేషన్ లో నిలిపివేశారు. అయితే వింత ఘటన ఒకటి చోటుచేసుకుంది. ట్రైన్ బ్రేకులను లాక్ చేసిన అధికారులు.. రైలు చక్రాలు కదలకుండా ఉండేందుకు చక్రాలకు, పట్టాలకు ఇనుప గొలుసులతో తాళం వేసి వార్తల్లో నిలిచారు. ఇదేంటని అక్కడి ప్రజలు అడిగితే.. వరదకు రైలు కదలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తాళం వేసినట్లు చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూస్తే కచ్చితంగా మనకు ఆ సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఇలా రైలు కదలకూడదన్న ఉద్దేశంతో ఏకంగా తాళాలు వేయడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.