వరంగల్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ట్రై సిటీస్ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. రైల్వే స్టేషన్ లో కూడా వరద నీరు ముంచెత్తడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా నగరంలో ఓ లేడీస్ హాస్టల్ వరదలో మునిగిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎటుచూసిన వాగులు ఉప్పొంగి వరద ప్రవాహాలు భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. అతిగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ప్రవాహాలతో రోడ్లు తెగాపోయి రాకపోకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలో వాగు ఉదృతంగా ప్రవహించడంతో మోరంచపల్లి గ్రామం వరదల్లో చిక్కుకుని 1500పైచిలుకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని రక్షించే పనిలో ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. కాగా వరంగల్ నగర నడిబొడ్డున ఓ లేడీస్ హాస్టల్ నీట మునిగింది. సుమారు 200మంది విద్యార్థినులు బిల్డింగ్ పైకెక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.
భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని అతలాకులం చేశాయి. వరదలతో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో నగర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డాబాలపైకెక్కి తలదాచుకుంటున్నారు. అధికారులను తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు. కాగా హంటర్ రోడ్డులోని రెసిడెన్షియల్ లేడీస్ హాస్టల్ నీట మునిగింది. ఆ హాస్టల్ లో 200మంది విద్యార్థినులు చిక్కుకున్నారు. రాత్రి ఒంటిగంట నుంచి బిల్డింగ్ పెకి చేరుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద నీరు ఎక్కువగా చేరుతుండడంతో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. తమను రక్షించాలంటూ బిల్డింగ్ పై నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. అంతా ఆడపిల్లలే కావడంతో హాస్టల్ యాజమాన్యం, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అధికారులకు తెలియడంతో వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.